అలహాబాద్ యూనివర్సిటీలో ఏదో ఒక కార్య్రక్రమానికి బిజెపి పార్లమెంటు సభ్యుడు యోగి ఆదిత్యనాధ్ దాస్ ను ముఖ్య అతిధిగా తీసుకు వెళ్ళడానికి ఎబివిపి(అఖిల భారత విద్యార్ధి పరిషత్) నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నూటపాతికేళ్ళ చరిత్ర, ఆక్స్ ఫర్డ్ ఆఫ్ ఈస్ట్ గా ప్రఖ్యాతి వున్న ఈ యూనివర్సిటీ విద్యార్ధి సంఘం ప్రసిడెంట్ గా పెద్దమెజారిటీ తో ఎన్నికైన ఎఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్) నాయకురాలు రిచాసింగ్ అందుకు ఒప్పుకోవడం లేదు. ఈమె దేశవ్యాప్తంగా వున్న యూనివర్సిటీలలో స్టూడెండ్స్ యూనియన్ లు అన్నిటిలోనూ తొలి, ఏకైక ఒక మహిళా ప్రసిడెంట్.
”’ఇష్టంలేని వారు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు, ఆవుమాంసం తినేవారిని చంపేసినా తప్పులేదు” వగైరా హెచ్చరికలతో సొంత పార్టీనే ఇబ్బందుల్లో పెట్టే యోగి ఆదిత్యనాధ్ దాస్ ను హిందూత్వ ఉగ్రవాదిగా భావిస్తూ వుంటారు. ”అటువంటి వ్యక్తి యూనివర్సిటీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడితే సామరస్యం దెబ్బతింటుందని రిచాసింగ్ వాదన.
ఏమైనప్పటికీ యూనియన్ నిర్ణయమే తుదినిర్ణయమౌతుంది. ఇది నచ్చని ఎబివిపి నాయకులు…రీసెర్చ్ స్కాలర్ గా రిచాసింగ్ ను తీసుకోవడం లోనే అక్రమంజరిగిందని, అడ్మిషన్ రద్దు చేయాలని వైస్ చాన్సలర్ కు ఫిర్యాదు చేశారు. రిచాసింగ్ మావోయిస్టు అని కూడా ఆరోపించారు.
వాద, ప్రతివాదాలు, ఫిర్యాదులు, వివాదాలు ఆయా స్ధాయిలకు మాత్రమే పరిమితమైతే సత్యం బయటపడుతుంది. న్యాయం జరుగుతుంది. ఇందుకు భిన్నంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఎబివిపి ఫిర్యాదు యూనివర్సిటీ అధికారుల వద్ద పెండింగ్ లో వుండగానే కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ జోక్యం చేసుకున్నారు. ఆయన ఉత్తరంపై మానవవనరుల మంత్రి స్మృతి ఇరానీ కార్యాలయం యూనివర్సిటీకి ఐదు రిమైండర్లు పంపింది. ఈ వత్తిడి అధికారులను ఆఘమేఘాల మీద యాక్షన్ మొదలైంది. రోహిత్ ఆత్మహత్యకు మూలమైంది. అతన్ని, మరో నలుగురినీ బహిష్కరిస్తూ యూనివర్సిటీ కమిటీ తీసుకున్న నిర్ణయం తప్పని కేంద్రం నియమించిన అధికారుల కమిటీ తేల్చేసింది. ఏమైనా రోహిత్ వెనక్కి రాలేడు.
డిల్లీ జెఎన్ యు (జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ) లో జరిగింది కూడా ఇలాంటిదే! ఒక ఫేక్ ట్వీట్ మీద స్వయంగా కేంద్రహోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ రియాక్టయ్యారు. డిల్లీ పోలీస్ కమీషనర్ ఇంకో అడుగు ముందుకి వేసి వీడియోటేపుల ఆధారంగా యూనివర్సిటీ విద్యార్ధి యూనియన్ ప్రసిడెంట్ కన్హయ్య కుమార్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఆ వీడియో టేపుల్లో రెండు టేపుల్లో బయటినుంచి తెచ్చిన అతుకులున్నట్టు ఫోరెన్సిక్ లాబ్ వెల్లడించింది.
లెఫ్ట్ పార్టీల కు అనుబంధంగా వున్న విద్యార్ధి యూనియన్లే లీడర్లుగా వున్న పూనే ఫిలిం ఇన్సిట్యూట్, చెన్నై ఐఐటీ, బెనారస్ హిందూ వర్సిటీ, జోధ్ పూర్ యూనివర్సిటీల్లో కూడా యూనియన్లకీ ఎబివిపి కి వివాదాలు వున్నాయి.
ఆధిక్యత కోసం ఎబివిపి తో సహా అన్ని విద్యార్ధి సంఘాలూ నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే వుంటాయి….వుండాలి…అయితే కేంద్రంలో అత్యున్నత స్ధాయిలో వున్నవారు ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడం సరైన పద్ధతికాదు. అసమర్ధత, అవినీతితో రాజ్యమేలిన కాంగ్రెస్ హయాంలో కూడా ఇది జరగలేదు. పిల్లల ఆటలో పెద్దవాళ్ళు చేరిపోతున్న బిజెపి తీరు సూదిని దూలానికి గుచ్చి మోసేస్తున్నట్టు వుంది. చిన్న విషయాలకు గొడ్డళ్ళు తీసే పరిస్ధితి వల్ల ప్రశాంతతను, సామరస్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చివరిక దేశభక్తులు, దేశద్రోహుల యుద్ధమన్న చిత్రం రూపుదిద్దుకుంటోంది. అందరూ దేశభక్తులే…ఎవరైనా దేశద్రోహులు వుంటే వారికి ఖచ్చితంగా శిక్ష పడవలసిందే! ఆవేశకావేశాలు రగులుతున్న నేపధ్యంలో శిక్ష కక్షసాధింపు అన్నట్టుగాక న్యాయంగా పడిందని హెచ్చు మంది తటస్ధులే వున్న సమాజం నమ్మడం కష్టమే!
అధికారంలో వున్నవారే సంయమనంగా వుండాలి. తమ మాటకాదన్న వారిని దేశద్రోహి అనే ముద్రవేసేలా వ్యవహరించడం ప్రజాస్వామిక విలువలకు తీవ్రమైన అపచారమే అవుతుంది.