బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుటుంబంపై వరుసగా కేసులు పడుతున్నాయి. ఓ వైపు కవిత అరెస్టు అయ్యారు. మరో వైపు అనేక విచారణలు .. కేటీఆర్, కేసీఆర్ వైపు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో రిలాక్స్ అవుతున్నది ఎవరంటే.. హరీష్ రావే. ఆయనపై ఇప్పటికి ఎలాంటి నిర్దిష్ట ఆరోపణలు రాలేదు. వస్తాయని కూడా అనుకోవడం లేదు.
కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేయడం బిగ్ షాక్‌నివ్వగా, దాని నుంచి తేరుకోకముందే భూకబ్జా కేసులో కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎంపీ, కేసీఆర్‌కు కొడుకు వరుసైన జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై భూ కబ్జా కేసు నమోదైంది. మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో కవిత భర్త అని ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉన్నదన్న చర్చ నడుస్తున్నది. ఆయన ఆర్థిక లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రభుత్వం చేయిస్తున్న అనేక విచారణలు కేటీఆర్, కేసీఆర్ వద్దకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణకు ప్రభుత్వం నిర్ణయించింది. అటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల వివాదాలపై కూడా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్‌లో కేటీఆర్ ను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇరికించడానికి అవసరమైన సరంజామా ప్రభుత్వం వద్ద రెడీగా ఉంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతూ అంతిమంగా బీఆరెస్ పెద్దలకు.. ముఖ్యంగా కేటీఆర్ లేక కేసీఆర్‌కు చుట్టుకునే అవకాశముందన్న ప్రచారం వినిపిస్తున్నది. హరీష్ రావు పేరు మాత్రం ఇప్పటి వరకూ ఏ విషయంలోనూ వివాదాస్పదం కాలేదు. ఆయన అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. దీంతో హరీష్ సేఫ్ జోన్ లో ఉన్నారని బీఆర్ఎస్ లో కూడా సెటైర్లు వినిపిస్తున్నాయి.