గత వారం ‘ఓం బీమ్ బుష్’తో టాలీవుడ్ కు ఓ హిట్ దక్కింది. శ్రీవిష్ణు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర నిలబడగలిగింది. ఈవారం ‘డీజే టిల్లు’ సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ వస్తోంది. టిల్లు గురించి తెలుగు ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా పూర్తయి కూడా చాలా కాలం అయ్యింది. ఫిబ్రవరిలో రావాల్సివుంది. కానీ.. ‘ఈగల్’ సినిమాకు దారి ఇవ్వడం కోసం వాయిదా పడింది. ఇప్పుడు మంచి ముహూర్తం చూసుకొని, సోలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకొంది. ‘టిల్లు’ అనూహ్యమైన విజయం సాధించడం, సిద్దు జొన్నలగడ్డ క్యారెక్టర్ బాగా పట్టేయడం, తన డైలాగులు వైరల్ కావడంతో ‘టిల్లు’ పాత్ర ఓ మైల్ స్టోన్‌లా మారిపోయింది. అందుకే ఈ సీక్వెల్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీక్వెల్ కి వచ్చేసరికి కొన్ని మార్పులు జరిగాయి. హీరోయిన్ మారిపోయింది. దర్శకుడు మారాడు. అయినా క్రేజ్ తగ్గలేదు. సరికదా, పెరిగింది. అనుపమ హాట్ లుక్స్, లిప్ లాక్స్.. యువతకు ఈ చిత్రాన్ని మరింత దగ్గర చేసింది. ‘టిల్లు’లో టైటిల్ సాంగ్ సూపర్ హిట్టు. ఈ సినిమాలోనూ పాటలు బాగా రీచ్ అయ్యాయి. టీజర్, ట్రైలర్లో.. టిల్లు స్థాయి వినోదం కనిపించింది. దాంతో.. విడుదల రోజు థియేటర్లు హౌస్ ఫుల్స్ అవ్వడం ఖాయం అనిపిస్తోంది.
సాధారణంగా ప్రతీవారం కొత్త సినిమాల తాకిడి ఎక్కువగానే కనిపిస్తోంది. కానీ ‘టిల్లు’ ధాటికి మరో సినిమా ఏదీ బాక్సాఫీసు ముందుకు రావడం లేదు. ఒకట్రెండు చిన్న సినిమాలొచ్చినా వాటి ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. అయితే డబ్బింగ్ బొమ్మ ‘ఆడు జీవితం’ (గోట్ లైఫ్) వస్తోంది. ఫృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన చిత్రమిది. అమలాపాల్ కథానాయిక. ఈ చిత్రాన్ని పూర్తిగా ఎడారిలో తెరకెక్కించడం విశేషం. కేరళ కోసం పని కోసం వెళ్లిన ఓ వ్యక్తి.. బానిసలా ఎలా మారాడు? అక్కడ్నుంచి ఎలా తప్పించుకొన్నాడు? అనేదే కథ. కొత్త తరహా చిత్రాలు ఇష్టపడేవాళ్లు ఓ లుక్ వేయొచ్చు.