ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ సడన్ గా ఊడి పడింది ‘వివేకం’ బయోపిక్. వివేకానంద రెడ్డి హత్య నేపథ్యంలో సాగే కథ ఇది. నేరుగా పే ఫర్ వ్యూ పద్ధతిలో ప్రేక్షకుల ముందుకు వెళ్లిపోయింది. దర్శకుడెవరో తెలీదు, నిర్మాతల అజెండా ఏమిటో తెలీదు, పెద్దగా నటీనటులు లేరు, ప్రచారం కూడా చేసుకోలేదు.. అయినా ఇలా విడుదలై, అలా వైరల్ అయిపోయింది. వివేకానంద హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎవరి గొడ్డలి పోటుకు వివేకానంద రెడ్డి బలయ్యారో, అర్థరాత్రి మూడు గంటలకు ఎవరెవరికి కాల్స్ వెళ్లాయో అవన్నీ బహిరంగ రహస్యాలే. వాటినే.. ధైర్యంగా వెండి తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. అందులోని కొన్ని సీన్లు… సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి.
ముఖ్యంగా అసలు వివేకానందరెడ్డికీ, జగన్ రెడ్డికీ ఎందుకు చెడిందో, హత్యకు ఎలా వ్యూహం పన్నారో.. ఇలా ప్రతీదీ పూస గుచ్చినట్టు వివరించారిందులో. నటీనటుల ఎంపిక కూడా బాగుంది. నిజ జీవిత పాత్రలకు దగ్గరగా ఉన్నవాళ్లనే ఎంచుకొన్నారు. సీబీఐ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఈ సినిమా తీశామని చిత్ర బృందం చెబుతోంది. పాత్రల పేర్లు కూడా నేరుగా వాడేశారు. జగన్ వ్యతిరేక వర్గమంతా ఈ సినిమాలోని సీన్లు.. వైరల్ చేసేసింది. ఎక్కడ చూసినా అవే దర్శనమిస్తున్నాయి. టీడీపీని టార్గెట్ చేసుకొని వర్మ తీసిన సినిమాల్ని చూడ్డానికి ఎవరూ ధియేటర్లకు వెళ్లలేదు. వాటి వల్ల వర్మ లాభపడ్డాడే తప్ప, టీడీపీకి గానీ, జగన్ వ్యతిరేక వర్గానికి గానీ ఎలాంటి డామేజ్ జరగలేదు. కానీ ఓ అనామకుడు తీసిన సినిమా, అందులోని దృశ్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయాయి. గొడ్డలి పోటా.. మజాకా!