ఫస్ట్ వికెట్ డౌన్… కేసీఆర్ కుటుంబంలో అందరిపై ఎన్నో ఆరోపణలు. కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చిన్న చిన్న కాంట్రాక్టుల వరకు అవినీతి జరిగిందని ఇంటా బయట విమర్శలు వచ్చాయి. కానీ ఎవరూ ప్రూవ్ చేయలేదు సరికదా కేసుల వరకు కూడా పోయిన సందర్భాలు అరుదు.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఉండగానే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు బయటకు వచ్చింది. ఇది పొలిటికల్ కేసుగానే బీఆర్ఎస్ వర్గాలు ఖండిస్తూ వచ్చినా, ఇది అరెస్ట్ వరకు… జైలు వరకు వెళ్తుందని ఎవరూ అనుకోలేదు. జైలు తప్పదూ అంటూ బీజేపీ రాష్ట్ర నేతలు ఆరోపించినా సరే, కేసు కొన్ని నెలల పాటు సైలెంట్ అయిపోవటంతో అరెస్ట్ ఉండదు అని అంతా అనుకున్నారు.
కానీ, ఓవైపు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోవటంతో కవితపై ఉన్న లిక్కర్ కేసుకు తోడు కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై అవినీతి చేశారంటూ ఎంక్వైరీలు మొదలయ్యాయి. బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ కేసీఆర్ అవినీతిపై ఎంక్వైరీలు చేస్తుండటంతో ఫస్ట్ వికెట్ రాష్ట్రంలో పడుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఫస్ట్ వికెట్ కవిత రూపంలో పడింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత ఇప్పటికే అరెస్ట్ అయినా రిమాండ్ లో మాత్రమే ఉన్నారు. కానీ రిమాండ్ ముగియటంతో జ్యూడీషియల్ రిమాండ్ కు ఈడీ విజ్ఞప్తి చేయగా… బెయిల్ పిటిషన్ ను వాయిదా వేసి మరీ ఈడీ విజ్ఞప్తికి కోర్టు ఓకే చెప్పింది. దీంతో కవితను తీహార్ జైలుకు తరలించారు.
సాధారణంగా మనీలాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయిన వారికి అంత సులువుగా బెయిల్ దొరకదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, కేటీఆర్ పై ఇప్పటికే ఫార్మూలా రేస్ లో అవినీతి ఆరోపణలుండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సంతోష్ రావుపై భూకబ్జా ఆరోపణలు వినిపిస్తుండగా… కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తో పాటు హరీష్ రావు పేరు కూడా వినిపించింది. అయితే, అవి ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి.