నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంత రావుతో మదన్ రెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం తీసుకోవడంతోనే మదన్ రెడ్డి తాజాగా మైనంపల్లితో భేటీ అయ్యారని సమాచారం.
మదన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడ్డారు. నర్సాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తనకు టికెట్ నిరాకరించి సునీతా లక్ష్మారెడ్డికి ఇవ్వడం పట్ల మదన్ రెడ్డి మనస్థాపం చెందారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు జోక్యం చేసుకొని ఆయన కాంగ్రెస్ లో చేరికను నిలువరించారు. మెదక్ ఎంపీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ హామీ ఇవ్వడంతో అప్పట్లో మెత్తబడ్డారు. దీంతో నర్సాపూర్ లో సునీతా లక్ష్మారెడ్డి గెలుపు కోసం పని చేశారు. అయినప్పటికీ తనతో చర్చించకుండానే సునీతా లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఏమాత్రం రుచించలేదు.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామి రెడ్డిని బీఆర్ఎస్ ప్రకటించింది. తనకు అవకాశమిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని.. పార్టీలో ప్రాధాన్యత కూడా లేకుండా పోయిందని మదన్ రెడ్డి భావిస్తున్నారు. దీంతో పార్టీ మారే ఉద్దేశ్యంతోనే తాజాగా మైనంపల్లితో భేటీ అయి చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల వేళ మదన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడటం ఆ పార్టీకి తీవ్ర నష్టం కల్గించే అవకాశముంది.