గ్లామర్ పాత్రలని కొందరు తీసిపారేస్తుంటారు. ఇంకొందరికి గ్లామర్ పాత్రలంటే చిన్నచూపు కూడా వుంటుంది. అందంగా, హాట్ గా ముస్తాబై కనిపించడమే కదా అనే ఓ తేలికపాటి భావన వుంటుంది కొందరిలో. కానీ తెరపై హాట్, గ్లామరస్ గా కనిపించడం అంత తేలిక కాదని అంటోంది అనుపమ పరమేశ్వరన్. ఇప్పటివరకూ పక్కంటి అమ్మాయిలా కనిపించే పద్దతైన పాత్రలు చేసిన అనుమప ‘టిల్లు స్క్వేర్’ లో ఒక్కసారి గ్లామరస్ డాల్ గా మారిపోయింది. టీజర్ ట్రైలర్ లో అనుపమ కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అనుపమ ఇంత హాట్ గా కనిపించడం ఇదే మొదటిసారి.
ఈ సినిమాలో చేసిన గ్లామరస్ పాత్ర గురించి అనుపమ పంచుకున్న అనుభవాలు ఆసక్తికరంగా వున్నాయి. ”ఒక అమ్మాయి స్క్రీన్‌పై హాట్‌గా కనిపించడం ఎంత కష్టమో నాకు ఈ సినిమాతో అర్థమైంది. గ్లామర్ పాత్రలు చేయడం ఒక సవాల్. కొన్ని కాస్ట్యూమ్స్ వేసుకుని సెట్లో అంతమంది నిలబడాలంటే ఎంత ఇబ్బందిగా వుంటుందో తెలిసొచ్చింది. కొన్ని కాస్ట్యూమ్స్‌కు గ్లాస్ వర్క్ ఉంటుంది. అవి గీసుకుపోతుంటాయి. ఇవన్నీ భరిస్తేనే ఆ పాత్రలు చేయగలం. నిజంగా ఇలాంటి ఇబ్బందులు పడుతూ గ్లామర్ పాత్రలల్లో విన్నోదాన్ని పంచుతున్న హీరోయిన్స్ ని మెచ్చుకోవాల్సిందే’ అని చెప్పుకొచ్చింది అనుపమ. మార్చి 29న ‘టిల్లు స్క్వేర్’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.