అదేంటో విచిత్రం. పవన్ కల్యాణ్‌తో కలిసి కాపురం చేసుకొంటున్నప్పటి కంటే, విడిపోయి విడాకులు తీసుకొన్న తరవాతే రేణూదేశాయ్ ఎక్కువ పాపులర్ అయ్యారు. ఆమె గురించి జనం, ఫ్యాన్స్, మీడియా ఎక్కువగా ఫోకస్ చేసింది. రేణూ ఏం మాట్లాడినా హాట్ టాపిక్ అయ్యింది. ఆమధ్య రేణూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్త హల్ చల్ చేసింది. రేణూ మాటలు, చేష్టలూ అలానే అనిపించాయి. కానీ ఆ తరవాత అలాంటి అలికిడేం కనిపించలేదు, వినిపించలేదు. ఇప్పుడు మళ్లీ రేణూ నోట రెండో పెళ్లి ప్రస్తావన వచ్చింది.
ఇంట్లో వాళ్ల ఒత్తిడితో, రెండో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పటికీ, తన కూతురి జీవితాన్ని దృష్టిలో ఉంచుకొని, ఆ ఆలోచన విరమించుకొన్నానని క్లారిటీ ఇచ్చారు రేణూ. ఆధ్య ఇంకా స్కూలుకెళ్లే దశలోనే ఉందని, తనకు కాలేజీకి వెళ్లే వయసొస్తే.. పరిపక్వతతో ఆలోచించగలదని, అలాంటి తరుణంలో తనని అన్ని విధాలా ఆధ్య అర్థం చేసుకొంటుందని, అప్పటి వరకూ పెళ్లి ప్రస్తావన రానివ్వకూడదని నిర్ణయించుకొన్నారని చెప్పుకొచ్చారామె. గతంలో ఇంట్లోవాళ్లు ఓ సంబంధం తీసుకొచ్చారని, పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకొచ్చారని గుర్తు చేశారు. నిశ్చితార్థం చేసుకొందామని కూడా భావించారని, అయితే ఆధ్య గురించి ఆలోచించి, ఆ ప్రతిపాదన పక్కన పెట్టామని రేణూ అంటున్నారు. భవిష్యత్తులో పెళ్లి చేసుకొంటారా? అని అడిగితే మాత్రం సమాధానం కచ్చితంగా చెప్పలేదు కానీ, రేణూ మాటలు వింటుంటే ఆ అవకాశాలు ఉన్నట్టే అనిపిస్తోంది. ఇంట్లోవాళ్ల ఇష్టమే తన ఇష్టమని, వాళ్లు ఇప్పటికీ తన పెళ్లి గురించి ప్రస్తావిస్తూనే ఉంటారని అంటున్నారు రేణూ.