మీడియాలో వచ్చే కథనాలు తమ పరువు నష్టం కలిగిస్తున్నాయంటూ దాఖలైన పటిషన్లపై విచారణ జరిపేటప్పుడు ట్రయల్ కోర్టులు అప్రమత్తంగా ఉండాలని సుప్రీంకోర్టు సూచించింది. యథాలాపంగా ఆ కథనాలను నిషేధించవద్దని.. ఒక వేళ అలా యాంత్రికంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే రచయిత, పబ్లిషర్ ప్రాథమిక హక్కుతో పాటు ప్రజలు తెలుసుకునే హక్కును కూడా ప్రభావితం చేసినట్లేనని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. జీ ఎంటర్ ప్రైజెస్ సంస్థ బ్లూమ్ బెర్గ్ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని తొలగించాలంటూ కోర్టును ఆశ్రయించడంతో దిగువ కోర్టు ఆ కథనాన్ని తొలగించాలని ఆదేశించింది. ఈ తీర్పుపై బ్లూమ్ బెర్గ్ మీడియా సుప్రీంకోర్టున ఆశ్రయించడంతో ఆ ఉత్తర్వులను కొట్టి వేస్తూ సుప్రీంకోర్టు.. దిగువ కోర్టులకు ఈ సూచన చేసింది.
నిజానికి దేశంలో మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాల విషయంలో ఇటీవలి కాలంలో అనేక మంది న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. లీగల్ నోటీసులు అసువుగా ఇచ్చేస్తున్నారు. సుప్రీంకోర్టు తాజా సూచనలు .. ఒక్క వ్యాపారమైన వార్తలకే కాకుండా అన్ని రకాల వార్తలకూ వర్తిస్తాయి. నిజానికి ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా రాజకీయ పరమైన వార్తలు రాసే జర్నలిస్టులు, పత్రికలకు వస్తూంటాయి. దానికి తాజా ఉదాహరణ గత వారం డ్రగ్స్ కేసులో రాజ్ పాకాల అనే వ్యక్తి ఉన్నారని మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. అవి అవాస్తవాలంటూ.. పరువు నష్టం అంటూ..ఒక్కో సంస్థపై వంద కోట్లకు పరువు నష్టం దాఖలు చేశారు రాజ్ పాకాల. ఆయన మాజీ మంత్రి కేటీఆర్ బావమరిది.
నిజానికి రాజ్ పాకాలకు సంబంధించి వచ్చిన కథనాల్లో ఎవరూ ఇన్వెస్టిగేట్ చేయలేదు. ఎవరూ నిర్దిష్టమైన ఆరోపణలు చేయలేదు. పైగా నిర్ధారణ చేయలేదు. వారికి వచ్చిన సోర్స్ అధారంగా.. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను గుర్తు చేస్తూ.. కథనాలు రాశారు. దానికి ఆయన వివరణ ఇస్తే.. ఆయా మీడియా సంస్థలు ప్రచురించేవి. కానీ అలా చేయకుండా నేరుగా బెదిరింపులకు పాల్పడ్డారు. ఆయన ఒక్కరే కాదు.. స్వయంగా మీడియాను నడుపుతున్న వారు కూడా ఇలాగే హెచ్చరికలు పంపారు. నమస్తే తెలంగాణ పత్రికలో ఉద్యోగాల్ని తీసేస్తున్నారంటూ కథనాలు రాసిన వారికీ ఇలాంటి నోటీసులే పంపారు ఆ పత్రిక ఓనర్ దామోదర్ రావు.
ఇలాంటి బెదిరింపులు పెరిగిపోతున్న సమయంలో సుప్రీంకోర్టు దిగువ కోర్టులకు ఇచ్చిన సూచనలు.. మీడియా సంస్థలు, జర్నలిస్టులతో పాటు ప్రజల ప్రాథమిక హక్కులను కూడా కాపాడేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.