ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారం గుడారంలో అరబ్బు – ఒంటె కథలా మారుతోంది. చలికి చస్తుందని ఒంటె తన ముక్కుని గుడారంలో పెట్టుకునేందుకు చాన్సిస్తే.. మొత్తం అరబ్బును గెంటేసి.. గుడారాన్ని ఆక్రమించుకున్న ఒంటె చందంగా బీజేపీ వ్యవహరిస్తోంది. నోటాకు దాటని ఓట్ల శాతమే కాదు.. గట్టిగా పోటీ చేసి డిపాడిట్ కూడా తెచ్చుకునే గట్టి లీడల్లు కూడా లేని బీజేపీ ఏకంగా ఆరు ఎంపీ, పది అసెంబ్లీ సీట్లు తీసుకుంది. టీడీపీ, జనసేన భుజాలపై మోసుకుని పోయి తమను గెలిపిస్తాయని అనుకుంటున్నారు. ఆ రెండు పార్టీలు అదే చేయాలనుకుంటున్నాయి. కానీ బీజేపీ సంతృప్తి పడటం లేదు. తమకు మరో సీటు కావాలని అంటోంది.
బీజేపీ ఎన్నికల ఇంచార్జ్ అరుణ్ సింగ్ నేతృత్వంలో విజయవాడలో పదాధికారుల సమావేశం జరిగింది. ఇందులో బీజేపీ పదకొండు ఎమ్మెల్యే సీట్లలో పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. ఆ పదకొండో సీటు ఏమిటన్నది స్పష్టత రాలేదు . టీడీపీ నుంచో.. బీజేపీ నుంచో లాక్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీకి అభ్యర్థులు లేరు. అయితే బయట నుంచి తెచ్చుకోవడమో…లేకపోతే ఆర్థిక స్తోమత చూసి ఇవ్వడమో చేయాల్సి వస్తోంది. అయినా పదకొండో సీటు అంటూ.. రంగంలోకి దిగడంతో టీడీపీ, జనసేన నేతుల నివ్వెర పోతున్నారు.
రాజంపేట లేదా తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో ఒక దాన్ని కేటాయించాలన్న డిమాండ్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే్ టీడీపీ స్పందన ఎలా ఉందో మాత్రం తెలియడం లేదు. జనసేన పార్టీ ఇంకా మూడు స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పొత్తుల వ్యవహారం, రఘురామరాజుకు నర్సాపురం సీటు కేటాయించకపోవడం వంటి అంశాలతో ఇరు పార్టీల క్యాడర్ అసహనంతో ఉన్నారు. ఇప్పుడు బీజేపీ పదకొండో సీటు కూడా తీసుకుంటే… పొత్తుల అపహాస్యం అయ్యే అవకాశం ఉంది.