తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం సంచలనంగా మారుతోంది. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసిన వైనం .. దానికి తగ్గ ఆధారాలు కళ్ల ముందే ఉన్నా.. వ్యాపారస్తుల్ని , హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసి బ్లాక్ మెయిల్ చేశారన్న ఆరోపణలు తీవ్రంగా ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ఈ ట్యాపింగ్ అంశంపై పెద్దగా స్పందించని బీజేపీ నేతలు .. ఇప్పుడు తెర ముందుకు వస్తున్నారు. తాము కూడా బాధితులేమని ఆధారాలు ఉన్నాయని అంటున్నారు.
బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి.. ట్యాపింగ్ బాధితుల్లో తాము కూడా ఉన్నామన్నారు. 2019 ఎన్నికల సమయంలో బీజేపీకి చెందిన భారీ మొత్తం సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. అత్యంత సీక్రెట్ గా తరలిస్తున్న ఆ సొమ్మును ఎలా పట్టుకున్నారో బీజేపీ నేతలకు అప్పుడు అర్థం కాలేదు. ఇప్పుడు బల్బు వెలిగినట్లుగా ప్రెస్ మీట్ పెట్టి.. అప్పుడు మా ఫోన్లు ట్యాపింగ్ చేయడం ద్వారానే పట్టుకున్నారని ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యుడని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కిషన్ రెడ్డే కాదు.. మాజీ ఎమ్మెల్యే, మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు. ట్యాపింగ్ కు మొదటి బాధితుడు రేవంత్ రెడ్డి అయితే.. రెండో బాధితుడ్ని తానేనన్నారు. దీనికి కారణం ఉంది. గతంలో ఆయన ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కేసులు నమోదయ్యాయి. ట్యాపింగ్ చేసి.. సీక్రెట్స్ విని.. ఈ కేసులు పెట్టించారని ఆయన అనుమానం. ఇప్పుడు అదే విషయాన్ని నేరుగా ఆరోపిస్తున్నారు.
ఇంకా చాలా మంది ట్యాపింగ్ బాధితులు బయటపడలేకపోతున్నారు. కానీ బీజేపీ నేతుల కూడా ఇప్పుడు తాము ట్యాపింగ్ కు బలయ్యామని తెరపైకి రావడం ఆసక్తికరంగా మారుతోంది. ఈ కేసును ఇలా ముక్కలు ముక్కులుగా విచారణ జరుపుతారా.. మొత్తంగా సమగ్రంగా విచారణ జరిపి నిందితుల్ని అరెస్టు చేస్తారా అని..బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ట్యాపింగ్ ఉచ్చు.. బీఆర్ఎస్ పెద్దల్ని గట్టిగానే పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.