ఆయన పేరు పారుపాటి వెంకట్రామిరెడ్డి. గ్రూప్ వన్ ఆఫీసర్ గా వచ్చి ఐఏఎస్ గా ప్రమోషన్ పొంది.. కలెక్టర్ గా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాతి రోజే ఎమ్మెల్సీ అయ్యారు. మళ్లీ ఏడాది తిరగకుండానే బీఆర్ఎస్ కంచుకోట నుంచి ఎంపీ అభ్యర్థి అయ్యారు. ఇనని వింతలు చేసి చూపించిన తాను చేయగలిగింది ఏదీ లేదనుకున్నారేమో కానీ.. తాను గెలిస్తే ఏటా వంద కోట్లు పిల్లల చదువులకు ఇచ్చేస్తానని హామీ ఇచ్చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తల్లో పేదలు ఎవరైనా తమ పిల్లల్ని చదివించుకోలేకపోతే తాను ఫీజులు కడతానన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే కాదు.. పేద ప్రజలకూ అలాంటి సమస్యలు వస్తే తానే ఫీజు కడతానన్నారు. అందు కోసం రూ. వంద కోట్ల ఫండ్ .. అదీ కూడా ఏడాదికి.. ఏర్పాటు చేస్తానని.. .. ఐదేళ్లలో ఐదు వందల కోట్లు ఇస్తానని చెప్పుకొచ్చారు. ఆయన హామీ చాలా ఆకర్షణీయంగా ఉంది.. కానీ ఆయన అంత స్థితిమంతుడా అంటే.. అధికారికంగా వివరాల ప్రకారం చూస్తే ఆయన ఆస్తి రూ. కోటి.. ఆయన భార్య ఆస్తి ఐదు కోట్లు ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం స్థిరాస్తుల విలువ ఏడు కోట్ల లోపే. మరి ఏటా వంద కోట్లుఎలా తెస్తారు ?
ఆయన ధైర్యం.. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం. గ్రూప్ వన్ కు ఎంపికైనప్పుడు ఆయన మధ్య తరగతి ఫ్యామిలీ. కానీ ఆయన కుటుంబం రియల్ ఎస్టేట్ లో పాతుకుపోయింది. రాజపుష్ప అని.. హైదరాబాద్ చుట్టుపక్క బడా రియల్ వెంచర్లు వేయడంలో కీలక పాత్ర. ఇది బీఆర్ఎస్ అగ్రనేతల బినామీ సంస్థ అన్న ఆరోపణలూ చాలా సార్లు విపక్షాలు చేశాయి. ఇందులో ఆయనకు నేరుగా భాగస్వామ్యం లేదు కానీ.. వీరి కుటుంబం అంతా ఆ వ్యాపారమే. ఇటీవల తెలంగాణసర్కార్ ఎన్నికలకు ముందు వేసిన వేలంలో పోటీ పడి భూములు దక్కించుకున్న కంపెనీల్లో రాజపుష్ప కూడ ఉంది. తన రియల్ ఎస్టేట్ డబ్బుల్ని… ఏటా వంద కోట్లు తనను ఎంపీగా గెలిపిస్తే పెడతానని పరోక్షంగా చెబుున్నారు వెంకట్రామిరెడ్డి. తన ఎన్నికల హామీకే ఇంత ఖర్చు పెడితే.. ఆయన ఆదాయం ఎంత ఉండాలో ?
కొసమెరుపేమిటంటే.. ఫీజులు కట్టుకోలేకపోతున్నారని కలెక్టర్ గా ఉండగా చూశాడంట.. అప్పుడేమీ చేయలేకపోయాడట.. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సొంత డబ్బులు ఇస్తాడట. ఇంత కన్నా మన పాలనా వ్యవస్థను అవమానించే మాజీ అధికారి ఎవరూ ఉండరేమో ?