ప్రముఖ నటుడు, తెదేపా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక సినీ కార్యక్రమంలో మహిళలను కించపరుస్తున్నట్లుగా మాట్లాడిన మాటలపై చాలా విమర్శలు ఎదుర్కోవలసి రావడంతో క్షమాపణలు చెప్పారు. ఆ క్షమాపణ చెప్పుకొంటున్నప్పుడయినా ఆయన ఆచితూచి మాట్లాడవలసింది కానీ అప్పుడు కూడా కొన్ని అనవసరమయిన మాటలు కొన్ని మాట్లాడారు. ఆయన సినిమాలలో ఎంత అద్భుతంగా డైలాగులు చెప్పగలిగినా, స్టేజిపై తప్పులు లేకుండా అనర్గళంగా మాట్లాడలేరనే సంగతి అందరికీ తెలుసు. పైగా ఆయనకు మహిళల పట్ల నిజంగానే చాలా గౌరవం ఉందని అందరూ నమ్ముతున్నారు కనుకనే ఆయన మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మళ్ళీ ఈరోజు శాసనసభలో దాని గురించి మాట్లాడేటప్పుడు బాలకృష్ణ మళ్ళీ తప్పు మాట్లాడారు.
“నాకు మహిళల పట్ల చాలా గౌరవం ఉంది. నా సినిమాలలో మహిళా పాత్రలను చూసినట్లయితే ఆవిషయం అర్ధం అవుతుంది. మహిళల పట్ల గౌరవంగా మెలగడం నేను తండ్రిగారి నుండే నేర్చుకొన్నాను. వారిని కించపరిచే ఉద్దేశ్యంతో నేను మాట్లాడలేదు. ఆ రోజు నా సినిమాలో పాత్రల (హీరోయిన్స్) స్వభావం గురించి ఏదో సరదాగా అన్నాను. ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు కూడా నా మాటలని చాలా ఎంజాయ్ చేసారు తప్ప ఎవరూ వేరే ఉద్దేశ్యంతో తీసుకోలేదు. కానీ బయట కొందరు వాటిని రాజకీయం చేసారు. అయినా నేను క్షమాపణలు కూడా చెప్పాను. ఇకపై నా సినిమాలలో చేసినందుకు మహిళా నటులు కూడా ఎంతో గర్వపడేవిధంగా సినిమాలు తీస్తాను,” అని బాలకృష్ణ చెప్పారు.
ఆయనకు మహిళల పట్ల చులకన భావం లేదని ఆయన మాటలలో స్పష్టం అవుతోంది. అదేవిధంగా ఇటువంటి విషయాలలో ఆయన మాటలను ఆచితూచి మాట్లాడలేరనే సంగతి కూడా స్పష్టం అవుతోంది. ఆ బలహీనత వలననే ఆనాడు వేదికపై మహిళల గురించి తను అన్న మాటలను ‘అందరూ చాలా ఎంజాయ్ చేసారని’ మళ్ళీ పొరపాటు మాట్లాడారు. అంటే ఆరోజు మహిళల గురించి తను మాట్లాడిన మాటలు తప్పు కాదని ఆయన వాదిస్తునట్లుంది. పైగా అవి సినిమాలలో మహిళా పాత్రల స్వభావం గురించి అన్న మాటలని సమర్ధించుకొన్నారు. ఆయన సినిమాలలో మహిళా పాత్ర గురించే మాట్లాడినా, ఒక బహిరంగ కార్యక్రమంలో అటువంటి మాటలు మాట్లాడటం చాలా తప్పు. అటువంటి తప్పులను సమాజం ఆమోదించదని గ్రహించాలి. మహిళల గురించి చులకనగా మాట్లాడటం ఆయన ఉదేశ్యం కాక పోయినప్పటికీ ఆయన తన నోటిని అదుపు చేసుకోలేని బలహీనత వలననే విమర్శలు ఎదుర్కోవలసి వస్తోంది. కనుక దీనిపై ఇక ఆయన మాట్లాడకుండా ఊరుకోవడమే దీనికి సరయిన పరిష్కారం.