క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా ఉప్పల్ మార్గంలో మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. చివరి రైళ్లు 12 : 15 గంటలకు బయలుదేరి.. 1 : 10 గంటలకు గమ్య స్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో నిర్ణయంతో క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నేటి మ్యాచ్ లో ముంబైని డీకొట్టనుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గి పాయింట్ల ఖాతాను తెరవాలని రెండు జట్లు ఉవ్విళ్ళురుతున్నాయి. భారీ మొత్తంలో వెచ్చించి పాట్ కమ్మిన్స్ ను సొంతం చేసుకున్న హైదరాబాద్ జట్టు.. విజయవంతమైన కెప్టెన్ గా పేరొందిన కమ్మిన్స్ సారథ్యంలోనైనా జట్టు తలరాత మారుతుందని అంచనాలు పెట్టుకుంది. మొదటి మ్యాచ్ లో నిరాశపరిచిన హైదరాబాద్ జట్టు.. బలమైన ముంబై జట్టును ఓడించేందుకు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తోంది.
ఇక.. ఉప్పల్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో అందరి కళ్ళు రోహిత్ పైనే ఉన్నాయి. ముంబై తరుఫున అతను 200 మ్యాచ్ లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఐపీఎల్ లో ఓ టీమ్ తరుఫున 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్ లు ఆడిన మూడో క్రికెటర్ రోహిత్. ఈ జాబితాలో రోహిత్ కన్నా విరాట్ కోహ్లీ, ధోని ముందున్నారు.