బీజేపీ పది మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇంతకు ముందే ఆరుగురు ఎంపీ అభ్యర్థుల జాబితానూ రిలీజ్ చేసింది. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో సంచనాలు ఏమీ లేవు. సోము వీర్రాజుకు ఆనపర్తి సీటులో పోటీ చేయడం ఇష్టం లేకపోవడంతో శివకృష్ణంరాజు అనే నేతను ప్రకటించారు. ఇక సుజనా చౌదరి , సత్యకుమార్, పార్థసారధి వంటి సీనియర్లకు అవకాశాలు లభించాయి. కైకలూరును కామినేని శ్రీనివాస్ కు కేటాయించారు. పొత్తుల్లో భాగంగా అభ్యర్థులపై మిత్రపక్ష పార్టీల వ్యతిరేకత లేకుండా చూసుకోవడంలో కూటమి విజయవంతం అయిందని అనుకోవచ్చు.
వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ టీడీపీపై తీవ్ర వ్యతిరేకత కనబరిచే బీజేపీ సీనియర్ నేతలకు ఎక్కడా టిక్కెట్ దక్కలేదు. జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు తమకు సీటు కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. అయితే వారికి సీట్లు ఇచ్చినా.. అభ్యర్థిత్వాలు ఇచ్చినా ఓటింగ్ జరగడం కష్టమన్న అంచనాలు ఉండటంతో వారి పేర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ధర్మవరంలో వరదాపురం సూరికి ఇస్తారని అనుకున్నారు కానీ.. చివరికి సత్యకుమార్ కు కేటాయించారు. పరిటాల కుటుంబం మద్దతు సత్యకుమార్ కే ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఎంపిక అంతా సాఫీగా సాగిపోయింది. అయితే నర్సాపురం ఎంపీ సీటు విషయంలో బీజేపీ వ్యవహరించిన విధానం మాత్రం మచ్చగా ఉండిపోయింది. నర్సాపురం నుంచి రఘురామకు ఇవ్వకూడదన్న ఉద్దేశతోనే పెద్దగా పేరు లేని శ్రీనివాసవర్మకు టిక్కెట్ కేటాయించారు. ఆ విషయంలో బీజేపీ హైకమాండ్ పై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో కానీ.. మిగతా అభ్యర్థులంతా.. పొత్తుల్లో భాగంగా కలిసిపోయే అభ్యర్థులు కావడంతో కూటమికి ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారు.