వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇడుపుల పాయ నుంచి రోడ్ షో చేసుకుంటూ ప్రొద్దుటూరు వచ్చి బహిరంగసభలో మాట్లాడారు. చాలా ఒపికగా.. సుదీర్ఘంగా తన పరిపాలన గురించి.. తనపై వస్తున్న ఆరోపణల గురించి.. ప్రజలకు రివర్స్ పద్దతిలో వివరించే ప్రయత్నం చేశారు. స్పీచ్‌లో హైలెట్ ఏమిటంటే వివేకా హత్య విషయంలో ఇంకా బుకాయించే ప్రయత్నం చేయడం. తాము చంపలేదని .. చంపించలేదని చెప్పలేదు కానీ.. దేవుడికి తెలుసు.. ఈ జిల్లా ప్రజలకు తెలుసంటూ.. కొత్త తెలివి తేటలు ప్రదర్శించారు.
చిన్నాన్నను అన్యాయంగా చంపారు. ఇంతటి దారుణం చేస్తూ నన్ను దెబ్బ తీసే రాజకీయం చేస్తున్నారు, ఇది కలియుగం కాకపోతే ఇంకేంటి? అని జగన్ ప్రశ్నింంచారు. ఇంత కన్నా అన్యాయం ఉంటుందా? మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిల్చొని. ప్రజల మద్దతు లేని చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయం.. అని ఆరోపించారు. వివేకా చిన్నాన్నను అతిదారుణంగా చంపి అతిహీనంగా బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడని ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ చంపినోడు ఉండాల్సినోడు జైల్లో కానీ నేరుగా నెత్తిన పెట్టుకుని మద్దతు ఇస్తోంది చంద్రబాబు, చంద్రబాబుకి సంబంధించిన వారేనని. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కోసం తపించి పోతున్న ఒకరిద్దరు తన వాళ్లు అన్నారు. జగన్ ఈ మాటలు చెబుతున్నప్పుడు ఎదురుగా ఉన్న వారు ఎవరూ చప్పట్లు కొట్టలేదు. అలా వింటూ ఉండిపోయారు .
డ్రగ్స్ కేసుపైనా సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు వదినగారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతిచేస్తావుంటే సీబీఐ వాళ్లు రెయిడ్ చేశారు. ఈ రెయిడ్ జరిగిందని తెలిసిన వెంటనే.. యెల్లో బ్రదర్స్ ఉలిక్కి పడ్డారు. దొరికితే తమ బ్రదర్ కాదని.. మన బ్రదర్ అని మన మీద నెట్టేసే యత్నం చేశారని ఆరోపించారు. నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకుని ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా.. వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఎన్ని సమస్యలు సృష్టించినా నన్ను కాపాడుకున్న మీకు ధన్యవాదాలని చెప్పుకొచ్చారు.
విపక్షాల పొత్తులపైనా జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కడి మీదకు అందరూ కలిసి వస్తున్నారన్నారు. ఈ మాటలంటున్నప్పుడు ఆయన స్వరం గద్గదమయింది. తన చెల్లెళ్లను కూడా తన మీదకు యుద్దానికి తెస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియని వారికి.. కొత్తగా ఉంటుందేమో కానీ.. అన్నీ తెలిసిన వారికి మాత్రం.. కాస్త వింతగా ఉండేలా ప్రసంగంసాగింది. అయితే ప్రతీ సభలోనూ జగన్ ఆవేశపడేవారు.. ఈ సభలో అంత ఆవేశం చూపించలేదు.