ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ ఒప్పుకోలు ప్రకటన చేశారు. లక్షల మంది ఫోన్లను ట్యాప్ చేశారని యూట్యూబ్ చానళ్లలో ప్రచారం చేస్తున్నారని కానీ ఒకరిద్దరి మాత్రమే చేసి ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. గ్రేటర్ పరిధిలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కార్యకర్తలతో సమీక్ష నిర్వహించిన సమయంలో కేటీఆర్ చాలా అసహనంగా కనిపించారు. సీఎం రేవంత్ పై పదేపదే అసభ్య పదజాలం వాడుతూ ప్రసంగించారు.
సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా.. ఓటుతోనే సమాధానం చెప్పాలని ప్రజల్ని కోరారు. ఓ వైపు ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా.. ఓ మాఫియాలాగా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి ఆస్తులు రాయించుకున్నారన్న విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో కొంత మంది హీరోయిన్ల ఫోన్లనూ ట్యాప్ చేశారని అంటున్నారు. ఈ వార్తలు సంచలనంగామారుతున్నాయి. ఈ క్రమంలో ట్యాపింగ్ జరిగిందని కేటీఆర్ అంగీకరించడం కీలకమైన విషయమే అనుకోవచ్చు.
ట్యాపింగ్ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు మరో ఇద్దరు పారిపోయారు. వారి కోసం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మిగతా వారిని గుర్తిస్తున్నారు. ఎస్ఐబీ పేరుతో ఓ మాఫియా రాజ్ నడిచిందని గుర్తించారు. ఈ కేసు కేటీఆర్ దగ్గరకు వస్తుందో రాదో కానీ.. ఆయన సీఎం రేవంత్ రెడ్డి అసహనంతో చేస్తున్న వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవతున్నాయి.