రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబోలో ఓ సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. చరణ్ కు ఇది 16వ చిత్రం. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. జాన్వీ కపూర్ కథానాయిక. ఈ సినిమా కోసం రెహమాన్ స్వరాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ చిత్రానికి రెహమాన్ పని చేయడం ఇదే తొలిసారి. ఇప్పటికే మూడు పాటలు రెడీ అయిపోయాయి. రెహమాన్ పాటలతోనే బ్లాస్ట్ మొదలు కాబోతోందని దర్శకుడు బుచ్చిబాబు చరణ్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే వార్త చెప్పేశారు. చరణ్ పుట్టిన రోజు వేడుకలు బుధవారం రాత్రి హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. అక్కడే.. బుచ్చిబాబు ఈ `మెగా లీక్` చేసేశారు.
బుచ్చిబాబు తొలి సినిమా ‘ఉప్పెన’. ఈ చిత్రానికి దేవిశ్రీ అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అసలు పాటల వల్లే ఈ సినిమాకు హైప్ వచ్చింది. పైగా ఇది సుకుమార్ రైటింగ్స్ లో వస్తున్న సినిమా. సుకుమార్ అంటేనే దేవిశ్రీ ప్రసాద్. వీరిద్దరిదీ `ఆత్మ` బంధం. ఈ విషయం కూడా సుకుమార్ చాలా సార్లు చెప్పారు. అలాంటిది.. సుకుమార్ రైటింగ్స్ లో, సుకుమార్ శిష్యుడు తీస్తున్న సినిమాలో దేవిశ్రీ లేకపోవడం ఆశ్చర్యకరమే. కాకపోతే చరణ్ సినిమాకున్న స్పాన్ ని దృష్టిలో ఉంచుకొని రెహమాన్ వరకూ వెళ్లాల్సివచ్చింది. రెహమాన్ నుంచి ఓ సూపర్ హిట్ ఆల్బమ్ వచ్చి చాలా కాలమైంది. ఆ లోటు… చరణ్ సినిమా తీరుస్తుందేమో చూడాలి.