ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ అసాధారణ ప్రదర్శన కనబరిచింది. ఉప్పల్ వేదికగా సిక్సర్లు, ఫోర్లతో పరుగుల వరద పారించారు. కొడితే కొట్టాలిరా సిక్స్.. ఆడితే ఆడాలిరా రఫ్ఫాడాలి అన్నట్లు విధ్వంసం సృష్టించారు. మొదటి నాలుగు ఓవర్ల తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు గేర్ మార్చారు. దాంతో ముంబై బౌలర్లకు బంతులెక్కడ వేయాలో తోచలేదు. బంతిని ఎవరు అందుకున్నా బ్యాట్స్ మెన్ సేమ్ రిజల్ట్ కనబరిచారు. పదేపదే ఫీల్డింగ్, బౌలింగ్ మార్పులు చేసినా సన్ రైజర్స్ బ్యాట్స్ మెన్ ను ముంబై ఆపలేకపోయింది. 31 పరుగుల తేడాతో ముంబైని ఓడించి పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఖాతా తెరిచింది.
మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. ట్రావిస్ హెడ్ ( 62: 24 బంతుల్లో 9ఫోర్లు, సిక్సులు ) , అభిషేక్ శర్మ (63: 23 బంతుల్లో 3 ఫోర్లు, 7సిక్సులు), మార్ క్రమ్ ( 42నాటౌట్, 28 బంతుల్లో 2ఫోర్లు, ఓ సిక్స్ ) , హెన్రిచ్ క్లాసెన్ (80 నాటౌట్: 34 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సులు ) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై లక్ష్య చేధనను ధాటిగానే ఆరంభించింది. కానీ, చివర్లో ఒత్తిడికి గురై తడబడి ఓటమిపాలైంది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 246 పరుగులు చేయగలిగింది. తిలక్ వర్మ ( 64, 34 బంతుల్లో 2 ఫోర్లు, 6సిక్సులు), టిమ్ డేవిడ్ (42 నాటౌట్ , 2ఫోర్లు, 3సిక్సులు) , ఇషాన్ కిషన్ (34 , 13బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సులు) ముంబైని గెలిపించేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
ఈ మ్యాచ్ ద్వారా నమోదైనకొత్త రికార్డులు ఇవే
ఒకే మ్యాచ్ లో ఇరు జట్లు 500కు పైగా స్కోర్ చేయడం ఇదే మొదటి సారి. మొత్తం 523 పరుగులు నమోదు అయ్యాయి.
2010సీజన్ లో రాజస్థాన్, చెన్నై జట్లు నమోదు చేసిన 469 పరుగులే ఇప్పటివరకు టాప్ స్కోర్ గా ఉండేది. ముంబై, హైదరాబాద్ జట్లు తాజాగా నమోదు చేసిన స్కోర్ తో ఇదివరకు రికార్డ్ ను బ్రేక్ చేశాయి.
ఐపీఎల్ లో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టు హైదరాబాద్ – 277 పరుగులు
లక్ష్య ఛేదనలో అత్యధిక స్కోర్ చేసిన జట్టు ముంబై ఇండియన్స్ – 246
ఈ మ్యాచ్ లో మొత్తం ఫోర్లు, సిక్సులు 69
గతంలో చెన్నై, రాజస్థాన్ జట్లు నమోదు చేసిన బౌండరీల సంఖ్యను ముంబై- హైదరాబాద్ జట్లు సమం చేశాయి.