ఆంధ్రప్రదేశ్‌లో వీఐపీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం. రాజ్యాలు పోయినా పూసపాటి వంశీయులు ప్రజాస్వామ్యంలోనూ ప్రజల మనసుల్ని గెలుచుకుని రాజులుగానే ఉన్నారు. అశోక్ గజపతి రాజు వరకు అప్రతిహతంగా సాగిన విజయ పరంపర ఆయన వారసురాలి విషయంలో మాత్రం ఆటంకాలు ఏర్పడుతున్నాయి. తొలి ప్రయత్నమే ఓటమి మిగిలింది. ఇప్పుడు పట్టుదలగా కుమార్తెను ఎమ్మెల్యేను చేయాల్సిందేనని అశోక్ గజపతిరాజు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన రాజకీయం నేటి రాజకీయానికి సరిపడుతుందా లేదా అన్నదానిపై సందేహాలు ఉన్నాయి. కానీ ఆయన ప్రజల్ని నమ్ముతున్నారు.
విజయనగరం అసెంబ్లీ స్థానంలో వైసీపీ, టీడీపీ మధ్య పోటాపోటీ పరిస్థితులు నెలకొన్నాయి. విజయనగరం నగర పాలక సంస్థలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని వైసిపి అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని, ఈ ఎన్నికల్లో జనసేన అదనంగా తోడైందని, వీటితోపాటు ఎమ్మెల్యే కోలగట్ల ఏకపక్ష వైఖరి కూడా తనకు కలిసి వస్తుందని టీడీపీ అభ్యర్థి పూసపాటి అదితి గజపతిరాజు గట్టి నమ్మకంతో ఉన్నారు. కొద్ది రోజులుగా ఇరు పార్టీల అభ్యర్థులూ ప్రచారంలో దూకుడు పెంచారు.
వైసీపీ అభ్యర్థి, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ఈ సారి తన కుమార్తెను పోటీ చేయించాలనుకున్నారు. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం ఆయనే పోటీ చేయాలని ఆరు నెలల కిందటే తేల్చి చెప్పారు.దాంతో ఆయన చాపకింద నీరులా అన్ని సామాజికవర్గాలు, ప్రాంతాలు, ఉద్యోగ, వ్యాపార సంఘాలతో మమేకమై ఎన్నికల వ్యూహానికి పదును పెట్టారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో వున్నారు. కార్పొరేషన్ కూడా పూర్తి స్థాయిలో వైసీపీ చేతుల్లో ఉండటంతో నగరంలో రోడ్ల విస్తరణ గడిచిన ఐదేళ్ల మునుపెన్నడూ లేనంతగానే చేపట్టారు. పార్కులూ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కోలగట్లకు కలిసొచ్చే అంశాలే.
అభివృద్ధి అంటే రోడ్లు, పార్కులు, లైటింగ్ వంటివేనా? ఉపాధి అవకాశాలు ఏమైనా పెంచారా? కనీసం ఉన్న ఉపాధి అవకాశాలనైనా నిలబెట్టారా? జ్యూట్ మిల్లుల మూతకు కారకులెవరు? ఆయా స్థలాలను కబ్జా చేసిందెవరుఅంటూ టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజుతో పాటు ఆమె మద్దతుదారులు ప్రశ్నిస్తూ ప్రచారం చేస్తున్నారు. నగరపాలక సంస్థ సొమ్ముతో చేపట్టిన పనులను కోలగట్ల తన గణకార్యంగా చెప్పుకుంటున్నారనే విమర్శలు చేస్తున్నారు. నగరపాలక సంస్థలో మితిమీరిన జోక్యంతో పెత్తనం చలాయించి ఈ పనులన్నీ చేశారని, చివరకు సొంత పార్టీకి చెందిన కార్పొరేటర్లకు సైతం స్వేచ్ఛలేకుండా చేశారని కూడా ప్రచారం చేస్తున్నారు.
అదితి తండ్రి అశోక్ గజపతిరాజు రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా పనిచేసినా నగరానికి ఒరింగిందేమీ లేదని, అసలు ప్రజల సమస్యలే పట్టించుకోలేదని, అందువల్లే చారిత్రక విజయనగరం చాలా వెనుకబడిందని కోలగట్ల ప్రచారం చేస్తున్నరాు. మాన్సాస్ భూములు, ఆస్తులు రాజులే కొల్లగొట్టారని వైసిపి నాయులు చెబుతుండగా, స్వామి ఎమ్మెల్యే అయ్యాయక నగరంలో దందాలు పెరిగిపోయంటూ టిడిపి నేతలు విమర్శిస్తున్నారు. తాము నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పేదలకు పంపిణీ చేయలేదని టిడిపి, తమ హయాంలో వేలాది మందికి సొంత స్థలాలు, ఇళ్లు మంజూరు సాధ్యమైందని వైసిపి కేడర్ చెబుతోంది. ఇలా ప్రచారంలోనూ ఒకొరికొకరు ధీటుగానే దూసుకెళ్తున్నారు.
గతంతో పోలిస్తే టిడిపి అభ్యర్థి తరపు ప్రచారం భిన్నంగా ఉంది. రెండు నెలల ముందు నుంచే ఇంటింటికి వెళ్లడంతోపాటు వార్డు స్థాయి నాయకులు, కార్యకర్తలతో అదితి గజపతి మమేకమౌతున్నారు. క్షేత్ర స్థాయి కేడర్‌తో కమ్యూనికేషన్ పెరుగుతోంది. అశోక్ గజపతిరాజుపై ప్రజల్లో అభిమానం తగ్గలేదు. కానీ ఆయన డబ్పు, ప్రలోభాల రాజకీయాలకు దూరం. అయినప్పటికీ కొంత మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. విజయనగరంలో గట్టి పట్టు అవనాపు సోదరులు పార్టీలో చేరడంతో టీడీపీకి మరింత బలం వచ్చినట్లయింది. వైసీపీలో వర్గ పోరు ఉంది. బొత్స వర్గం .. కోలగట్లకు సహకరించే పరిస్థితి లేదు.
విజయనగరం అసెంబ్లీ నుంచి అశోక్ గజపతి రాజు ఒక్క సారి వెయ్యి ఓట్లతో ఓడారు.గత ఎన్నికల్లో ఆయన కుమార్తె ఏడు వేల ఓట్లతో ఓడారు. అప్పట్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు పూర్తి గా మారిపోయాయని.. టీడీపీ గట్టి నమ్మకంతో ఉంది. ప్రభుత్వంపై పాజిటివ్ ఓటింగ్ ఉంటుందా.. నెగెటివ్ ఓటింగ్ ఉంటుందా అన్నది ఫలితాన్ని తేల్చే అవకాశం కనిపిస్తోంది.