పాపం.. హార్దిక్ పాండ్యా. ఈ ఐపీఎల్ లో ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోతున్నాడు. గుజరాత్ తో జరిగిన తొలి మ్యాచ్‌లో చెత్త కెప్టెన్సీతో విమర్శల పాలయ్యాడు. దానికి తోడు. కెప్టెన్‌గా రోహిత్ శర్మని తప్పించి, పాండ్యాని తీసుకురావడం ముంబై ఫ్యాన్స్‌కు నచ్చలేదు. అందుకే పాండ్యా చేసిన తప్పులన్నీ భూతద్దంలో కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లోనూ హార్దిక్ విమర్శకులకు అడ్డంగా దొరికేశాడు. తొలుత టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకొన్నాడు పాండ్యా. అక్కడి నుంచే… ముంబై పై హైదరాబాద్ బ్యాటర్ల ఊచకోత మొదలైంది. ముందుగా బౌలింగ్ చేయాలా, బ్యాటింగ్ చేయాలా అనేది టీమ్ నిర్ణయం కాబట్టి, పాండ్యా ఒక్కడినే నిందించలేం.
అయితే.. తొలి స్పెల్ బుమ్రాకు ఇవ్వకపోవడం, తొలి పదకొండు ఓవర్లలో బూమ్రాతో ఒక్క ఓవరే వేయించడం విమర్శల పాలయ్యింది. అప్పటికే.. ముంబై చేతుల్లోంచి మ్యాచ్ జారిపోయింది. అలాంటి సమయంలో బుమ్రా వచ్చినా ఏం చేయలేడు. వరల్డ్ క్లాస్ బౌలర్ ని పెట్టుకొని, తొలి స్పెల్ తాను వేయాలనుకోవడం హార్దిక్ చేస్తున్న తప్పు. గుజరాత్ మ్యాచ్‌లోనూ హార్దిక్ అదే చేసి విమర్శల పాలయ్యాడు. ఆ తప్పుని ఇక్కడ కూడా సరిదిద్దుకోలేదు. తొలి స్పెల్ వేసిన హార్దిక్ ఏమైనా అద్భుతంగా బౌలింగ్ చేశాడా అంటే అదీ లేదు. తాను ధారాళంగా పరుగులు ఇచ్చి హైదరాబాద్ బ్యాటర్లకు గేట్లు ఎత్తడంలో సహాయపడ్డాడు. చివరి ఓవర్ స్పిన్నర్ కు ఇవ్వడం కూడా హార్దిక్ చేసిన పెద్ద తప్పిదమే. మరోవైపు బ్యాటింగ్ లోనూ హార్దిక్ నిరాశ పరిచాడు. ఓవర్ కు 15 పరుగులు అవసరమైన సమయంలో బ్యాటింగ్ కి వచ్చిన హార్దిక్ రన్ రేట్‌కు తగ్గట్టుగా ఆడలేకపోయాడు. దాంతో… ఈసారీ తను ట్రోలింగ్ కి గురవుతున్నాడు. ముందు బ్యాటింగ్ పై దృష్టి పెట్టాలని, ఆ తరవాత బౌలింగ్ గురించి ఆలోచించాలని, బుమ్రా లాంటి బౌలర్ తో తొలి స్పెల్ వేయించాలన్న కనీస స్పృహ కూడా లేకుండా కెప్టెన్ ఎలా అయ్యాడని… ఇలా మాజీలు సైతం హార్దిక్ ను విమర్శిస్తున్నారు. ఇలాంటి తప్పులే పునరావృతం చేస్తూపోతే, తాను మునగడమే కాదు, ముంబైనీ ముంచేసే ప్రమాదం ఉంది.