కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి… ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం సమీక్షకు ఆహ్వానించిన వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు కూడా ఏ మాత్రం ప్రయత్నించడంలేదు. దీంతో ద్వితీయ శ్రేణి క్యాడర్ లో అసహనం పెరిగిపోతోంది. పరిస్థితి దిగజారిపోతూంటే.. కేటీఆర్ సమీక్షల పేరుతో పిలిచి .. ఇలా ప్రసంగాలు ఇచ్చి పంపించేస్తూండటంతో చాలా మంది ఆసక్తి కోల్పోతున్నారు.
బుధవారం సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ స్థానాలపై హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. అభ్యర్థులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. కానీ అసలు సమీక్ష అంట ూఏమీ జరగలేదు. ఎంపీ స్థానంలో బలాబలాలేంటి..? బలహీనతలేంటి..? గతంలో జరిగిన పొరపాట్లేంటి..? వాటిని ఇప్పుడు ఎలా అధిగమించాలి..? స్థానిక నేతల మధ్య సఖ్యత ఉందా? లేదా? లేకపోతే వారిని ఎలా సమన్వయం చేయాలి..? ప్రత్యర్థులు, వారి పార్టీల స్థితిగతులేంటి..? ఇలా సమస్యలను గుర్తించి పరిష్కరించి క్యాడర్‌కు దిశా నిర్దేశం చేయాలి. కానీ కేటీఆర్ అసలు ఇదంతా పనికి రాని వ్యవహారం అనుకుంటున్నారు.
అధిష్టానం వద్ద పలుకుబడి కలిగిన ఒకరిద్దరు నేతలు మాట్లాడటం, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్‌తో మాట్లాడించి, వెంటనే సమావేశాన్ని ముగింపజేయటం పరిపాటిగా మారింది. కేటీఆర్ ప్రధానిపైనా, ముఖ్యమంత్రిపైనా నోరు పారేసుకోవటం, దుర్భాషలాడటం చేస్తున్నారు. అవి మీడియాలో హైలెట్ కావొచ్చు కానీ.. ఎన్నికల్లో ఎలా ఉపయోగపడతాయని క్యాడర్ అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల సభల్లో అలాంటి విమర్శలు చేసుకోవచ్చు కానీ.. సమీక్షల్లో చేయాల్సిన అవసరం ఏమిటనేది సమావేశాలకు హాజరయ్యే వారికీ అర్థం కావడం లేదు. కొసమెరుపేమిటంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూసి కేటీఆర్.. అవన్నీ మళ్లీ వస్తాయని.. దున్ని పారేస్తామన్న నమ్మకంతో పంపించేస్తున్నారు. కేటీఆర్ మాటలు విని.. ఇంకా ప్రభావం తగ్గలేదనుకుని వెళ్లిపోతున్నారు నేతలు.