సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై దర్శకుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో తన క్రియేటీవ్ ఇన్వాల్వ్మెంట్ కూడా తప్పకుండా ఉంటుంది. ‘విరూపాక్ష’ సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా ఉపయోగపడ్డాయి. అన్నింటికంటే ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో సుకుమార్ సలహాలు బాగా పనిచేశాయి. ఇప్పుడు రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా పట్టాలెక్కింది. మైత్రీ మూవీస్ తో పాటుగా సుకుమార్ రైటింగ్స్ కూడా నిర్మాణంలో భాగం పంచుకొంది. బుచ్చిబాబు తొలి సినిమా ‘ఉప్పెన’ పట్టాలెక్కడానికి సుకుమార్ కారణం. అయితే ఆ సినిమాలో బుచ్చికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశాడు సుక్కు. కథ విషయంలో కలగచేసుకోలేదు.
అయితే ఇప్పుడు అలా కాదు. ఈ కథలో సుకుమార్ పాత్ర కూడా ఉందని తెలుస్తోంది. బ్యాక్ డ్రాప్, హీరో క్యారెక్టరైజేషన్, క్లైమాక్స్ తదితర అంశాల్లో సుకుమార్ ఇన్ పుట్స్ బాగా పని చేశాయట. నిజానికి ఎన్టీఆర్ తో చేయాల్సిన కథ ఇది. అది కాస్త రామ్ చరణ్‌కు వచ్చింది. రామ్ చరణ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందో, తనకు ఎలాంటి పాత్రలు సూటవుతాయో.. సుకుమార్‌కు బాగా తెలుసు. ఆ అనుభవంతో బుచ్చికి కొన్ని సలహాలు ఇచ్చాడని, దాని ప్రకారం స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్ మారాయని తెలుస్తోంది. ఈ కథని ఎన్టీఆర్ నుంచి చరణ్ కు షిఫ్ట్ చేయమన్న సలహా ఇచ్చింది, చరణ్ ను ఫ్రేమ్ లోకి తీసుకొచ్చింది కూడా సుకుమార్ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.