అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందని అనుచరులు ఆందోళన చేపట్టారు. అనపర్తి సీటును నల్లమిల్లికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. పార్టీ గుర్తు సైకిల్ ను మంటలో వేసి నిరసన తెలిపారు. టికెట్ దక్కకపోవడంతో నల్లమిల్లి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆయన కంటతడి పెట్టుకోవడం కార్యకర్తలను కలిచివేసింది.
వాస్తవానికి టీడీపీ మొదటి జాబితాలోనే అనపర్తి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. టికెట్ ఖరారు కావడంతో ప్రచారం కూడా షురూ చేశారు. కానీ, టీడీపీ – జనసేన- బీజేపీ పొత్తు ఖరారు అయిన తర్వాత రాజమహేంద్రవరంతో పాటు అనపర్తి అసెంబ్లీ సీటును బీజేపీ కోరుతూ వచ్చింది. ఇందుకు చంద్రబాబు అభ్యంతరం చెప్తూ వచ్చారు. అనపర్తి సీటును నల్లమిల్లికి ఇచ్చి వెనక్కి తీసుకోలేమని.. ఆయన కుటుంబం నాలుగు దశాబ్దాలుగా పార్టీకి సేవలందించిందని గుర్తు చేశారు.
నల్లమిల్లి అనపర్తి నుంచి పోటీ చేస్తే ఆయన గెలుపు నల్లేరు మీద నడకేనని వైసీపీ ఆందోళన చెందింది. అందుకే బీజేపీ నేతలతో వైసీపీకి ఉన్న పరిచయాలతో ఈ స్థానాన్ని బీజేపీకి దక్కేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలా అనపర్తి మీద బీజేపీ బెట్టు చేయడంతో ఆ స్థానం కమలం ఖాతాలోకి వెళ్లిపోయింది. రామకృష్ణారెడ్డి ఐదేళ్లుగా స్థానికంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. జనాల్లో ఆయనకు మంచి ఆదరణ ఉంది. అయినప్పటికీ ఆయనను పక్కనపెట్టి బీజేపీ టికెట్ దక్కించుకోవడంతో టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.
టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి రెబల్ గా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి జనాల్లోకి వెళ్తానని ప్రకటించడంతో నల్లమిల్లి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే ఆయన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.
అనపర్తి తెలుగు తమ్ముళ్ళ ఆగ్రహ జ్వాలల గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నల్లమిల్లికి ఫోన్ చేశారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని.. పార్టీ అండగా ఉంటుందని బుజ్జగించే ప్రయత్నం చేశారు. నియోజకవర్గంలో తాజా పరిస్థితిని వివరించి.. కార్యకర్తల ఆవేదనను చంద్రబాబుకు వివరించారు. దీంతో నల్లమిల్లి ఇప్పుడేం నిర్ణయం తీసుకుంటారు..? అనేది ఉత్కంఠ రేపుతోంది.