అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. ఏప్రిల్ నాలుగో తేదీన దస్తగిరి పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది. విచారణ సందర్భంగా అప్రూవర్ గా మారిన దస్తగిరి కి బెయిల్ రద్దు చేయాలని కోరే అధికారం లేదన్న అవినాష్ తరుపు న్యాయవాది గట్టిగా వాదించారు. అయితే నెల రోజుల క్రితమే NIA కేసులో అప్రూవర్ వేసిన పిటిషన్ ను డివిజన్ బెంచ్ అనుమతించిందని హైకోర్టు గుర్తు చేసింది. అప్రూవర్ కి అడిగే హక్కు ఉందని డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ స్పష్టంగా ఉందన్న న్యాయస్థానం.. అప్రూవర్ దస్తగిరి పిటిషన్ ను తిరస్కరించలేమని స్పష్టం చేసింది.
అప్రూవర్ గా ఉన్న దస్తగిరిని ఓటీవల ఓ కేసులో అరెస్ట్ చేసి ఆరు నెలలకుపైగా పులివెందుల జైల్లో ఉంచారు. ఈ సందర్భంగా తనను జైల్లో ప్రలోభ పెట్టారని దస్తగిరి ఆరోపించారు. ఏకంగా ఇరవై కోట్ల నగదు జైల్లోకే తెచ్చారని పిటిషన్ వేశారు. తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే తన కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టులో మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ఖండిషన్స్ అవినాష్ రెడ్డి అతిక్రమించారని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.
అంతకు ముందు ఆయన కుటుంబసభ్యులపై దాడి జరిగింది. ఈ విషయంపైనా కోర్టును ఆశ్రయించారు. తన తండ్రిపై ఏపీ సీఎం జగన్ రెడ్డి , సతీమణి భారతి , దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి, అతని కుమారుడు చైతన్య రెడ్డి అనుచరులు దాడి చేశారని తెలిపారు. విట్నెస్ ప్రొటెక్షన్ స్కీం కింద కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని దస్తగిరి కోర్టును కోరారు. కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే పులివెందుల నుంచి జగన్ మీద పోటీ చేస్తానని దస్తగిరి ప్రకటించారు.