బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ సినిమా ప్రభావం ఆ ఎన్నికల్లో కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల సమయంలో వస్తుంది. తాజాగా నిర్వహించిన లెజెండ్ 10 ఇయర్స్ వేడుకలో బాలయ్య దీనిపై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.
‘2014 ఎలక్షన్స్ కి ముందు లెజెండ్ విడుదలైయింది. దాని ప్రభావం ఎన్నికలపై ఎంత వుందో మనం చూశాం. లెజెండ్ చూపించిన సన్నివేశాలు రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టాయి. మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి. యాదృచ్ఛికంగా సినిమా మళ్ళీ విడుదల కాబోతుంది. సినిమా ఎంత ప్రభావం వుంటుందో రేపు ఎన్నికల్లో చూడబోతున్నారు. జయం మనదే” అని వ్యాఖ్యానించారు బాలయ్య.