ఏపి సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్ కి నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈనెల 3వ తేదీన అతను హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో పట్టపగలు నడిరోడ్డుపై ఒక ముస్లిం వివాహిత మహిళ పట్ల అసభ్యంగా వ్యవహరించినందుకు పోలీసులు అతనిపై, అతని డ్రైవర్ పై నిర్భయ చట్టం, ఐపీసీ సెక్షన్ 354 క్రింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు. అతని తరపున న్యాయవాదులు బెయిల్ కోసం వేసిన పిటిషన్ని ఈరోజు విచారించిన నాంపల్లి కోర్టు అతనికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఈ కేసులో పోలీసులు అతనిని విచారించేందుకు మార్చి 9, 10 తేదీలలో జ్యూడిషియల్ కస్టడీకి అనుమతించింది.