మేము గేట్లు ఓపెన్ చేస్తే చాలామంది కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ లో మిగిలేది ఆ నలుగురే అంటూ ఆ మధ్య సీఎం రేవంత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆ గేట్లను లోక్ సభ ఎన్నికలకు ముందే ఓపెన్ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో జోష్ తీసుకోచ్చేందుకు చేరికలు ముమ్మరం చేయాలనుకుంటున్నారు. ఢిల్లీ నుంచి కూడా రేవంత్ కు స్పష్టమైన ఆదేశాలు ఉండటంతో చేరికలపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.
లోక్ సభ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను నైతికంగా దెబ్బతీయాలని రేవంత్ భావిస్తున్నారు. అందుకోసం కాంగ్రెస్ తో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలని ప్లాన్ రెడీ చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తున్నారు. పార్టీలోకి చేరికలకు ఇదే సరైన సమయమని రేవంత్ భావిస్తుండటంతో…9మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం ద్వారా బీజేపీని కూడా కాస్త వీక్ చేయవచ్చుననేది రేవంత్ ప్లాన్. పార్టీలోకి వరుసగా నేతల చేరికలతో చర్చంతా కాంగ్రెస్ వైపు ఉంటుందని.. అది బీఆర్ఎస్ పైనే కాకుండా బీజేపీపై కూడా ఇంపాక్ట్ చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. అందుకే లోక్ సభ ఎన్నికల ముందు తెలివిగా రేవంత్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్లుగా కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన ఆ 9 మంది ఎమ్మెల్యేలు గతంలో కాంగ్రెస్ లో పని చేసిన వెళ్లిన నేతలేనని సమాచారం.