Tillu Square movie review
తెలుగు360 రేటింగ్ : 3/5
-అన్వర్
కొన్ని పాత్రలు, టైటిళ్లు… ఆయా నటీనటుల కెరీర్లకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోతుంటాయి. ‘డీజే టిల్లు’ అలాంటిదే. ఈ సినిమా ‘మామూలు’ సిద్దు జొన్నలగడ్డని ‘స్టార్ బోయ్’ సిద్దు జొన్నలగడ్డగా మార్చేసింది. క్రేజీ హీరోని చేసేసింది. టిల్లు అనేది అందరి నోళ్లల్లో, ఇళ్లల్లో నానే పేరు అయిపోయింది. ఈ అర్హతలు చాలు. టిల్లు పాత్రని అడ్డు పెట్టుకొని సీక్వెల్ తీయడానికి. ‘టిల్లు స్క్వేర్’ అలానే తయారైంది. టిల్లుపై అభిమానం ఒక ఎత్తు, టీజర్ – ట్రైలర్లో చూపించిన కంటెంట్ మరో ఎత్తు… అనుపమ పరమేశ్వరన్ ఇచ్చిన లిప్‌లాక్‌లు ఎత్తుకు పై ఎత్తు. అందుకే ‘టిల్లు స్క్వేర్’ అంతెత్తులో కనిపించింది. మరి.. టిల్లులోని వినోదం ఈ స్క్వేర్‌లోనూ ఉందా? ఆ మ్యాజిక్ రిపీట్ అయ్యిందా?
టిల్లు (సిద్దు జొన్నలగడ్డ) ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతుంటాడు. పాత గొడవలూ, సిల్లీ పంచాయితీలూ మర్చిపోయి హ్యాపీగా బతికేద్దాం అనుకొంటున్న తరుణంలో తన జీవితం లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) రూపంలో ఊహించని మలుపు తిరుగుతుంది. ఓ పార్టీలో లిల్లీని చూసిన టిల్లూ ఫ్లాటైపోతాడు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ రాత్రే ఇద్దరూ ఒక్కటైపోతారు. తెల్లారితే.. ఓ చిన్న లెటర్ రాసి, అక్కడ్నుంచి మాయం అయిపోతుంది లిల్లి. అప్పటి నుంచి లిల్లీ ఎక్కడికి వెళ్లిపోయిందో తెలీక పిచ్చోడై తిరుగుతుంటాడు. కొన్ని రోజుల తరవాత లిల్లీ మళ్లీ దర్శనమిస్తుంది. ఆ తరవాత ఏమైంది? అసలు లిల్లీ ఇలా హైడ్ అండ్ సిక్ గేమ్ ఎందుకు ఆడుతుంది? దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ (మురళీ శర్మ)కీ ఈ కథకూ ఉన్న లింకేమిటి? అనేవి తెరపై చూసి తెలుసుకోవాల్సిన విషయాలు.
మ్యాజిక్ ఒక్కసారే జరుగుతుంది. దాన్ని రిపీట్ చేయడం చాలా కష్టం. సినిమాలూ అంతే! ఓ హిట్ సినిమాకు సీక్వెల్ తీయడంలో మరింత ఎక్కువ కష్టం దాగుంది. చాలా విషయాలు కుదిరితే గానీ ఆ మ్యాజిక్ మళ్లీ సాధ్యం కాదు. అదృష్టవశాత్తూ… ‘టిల్లు స్క్వేర్’కు అవన్నీ కలిసొచ్చాయి. అసలు టిల్లు పాత్రలోనే ఏదో మ్యాజిక్ ఉంది. ‘టిల్లు’ హిట్టయ్యిందంటే అదేదో అద్భుతమైన కథనో, ఇది వరకు చూడని సినిమా అనో కాదు. టిల్లు క్యారెక్టరైజేషన్. ఆ పాత్ర ఎంతలా పట్టేసిందంటే – తను ఏం మాట్లాడినా వినబుద్ధేసింది. ఏం చేసినా చూడ ముచ్చటేసింది. ఆ బలమే.. ఈ సీక్వెల్ లోనూ బలంగా పని చేసింది. ‘టిల్లు స్క్వేర్’ కథ కోసం సిద్దు జొన్నలగడ్డ పెద్దగా కష్టపడలేదు. ‘డీజే టిల్లు’ ఫార్మెట్ లోనే సీక్వెల్ కూడా రాసేసుకొన్నాడు. అచ్చంగా అదే టాంప్లేట్ ఫాలో అయిపోయాడు. టిల్లు ఓ అమ్మాయి మాయలో పడడం, ఆ అమ్మాయి వెనుక ఓ మిషన్ ఉండడం, అందులో… టిల్లు చిక్కుకోవడం, మళ్లీ బయటపడడం… ‘టిల్లు’లో చూసింది అదే. స్క్వేర్‌లోనూ అదే కనిపించింది. ఓ సాధారణమైన కథని, తన అసాధారణమైన బాడీ లాంగ్వేజ్‌తో, డైలాగ్ డెలివరీతో సిద్దు జొన్నలగడ్డ ఎలా స్పెషల్ గా మార్చేశాడో.. ఇక్కడా అదే చేశాడు. సన్నివేశాలు సాదా సీదాగా ఉంటాయి. ట్విస్టులు అర్థమైపోతుంటాయి. కానీ అక్కడ సిద్దు చేసే మ్యాజిక్ మాత్రం కట్టిపడేస్తుంటుంది. ఇంత రొటీన్ సీనేంట్రా బాబూ.. అనుకొంటున్న దశలో టిల్లు పేల్చే డైలాగో, వన్ లైనరో.. ఆ సీన్‌ని పాస్ చేసేస్తుంటుంది. ఇలాంటి మ్యాజిక్ ఈ సినిమాలో చాలా సార్లు జరిగింది. టిల్లు పాత్ర ఎంతలా ఎక్కేస్తుందంటే, కొన్ని కొన్ని సార్లు.. టిల్లు పాజ్ అయిపోయి.. ఓ రకమైన ఎక్స్ప్రెషన్ ఇస్తుంటాడు. అక్కడ డైలాగులేం ఉండవు. కానీ ఘొల్లుమంటుంది ఆడిటోరియం. ఇక మాట్లాడితే… చెప్పేదేముంది..?
డీజే టిల్లులో ఏం జరిగిందో హింట్ ఇస్తూ… సీక్వెల్ కథ మొదలెట్టాడు దర్శకుడు. ‘డీజే టిల్లూ చూడూ..’ అంటూ పాత పాటనే మళ్లీ వేసుకొన్నాడు. ‘డీజే టిల్లు’లో ఏం జరిగిందో మాటి మాటికీ ఫ్లాష్ కట్స్‌లో చూపించడం కాస్త విసుగు తెప్పిస్తుంటుంది. పాత పాటే వాడి, పాత సీన్లు వేస్తున్నాడేంట్రా అనే ఫీలింగ్ వస్తుంది. కాకపోతే… మెల్లగా సొంత ముద్ర చూపిస్తూ కథని నడిపించాడు. లిల్లీ పేరుతో అనుపమ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో, అప్పుడే టిల్లు మరోసారి మాయలో పడిపోతున్నాడనిపిస్తుంది. అక్కడక్కడ పాత సీన్లు రిపీట్ అయిన ఫీలింగ్ వచ్చినా, తెరపై టిల్లు చేసే హంగామా ముందు ఆ అసంతృప్తి మాయమైపోతుంది. ఇంట్రవెల్ ముందొచ్చే ట్విస్ట్ పెద్దగా థ్రిల్ ఇవ్వదు. ‘పూర్తిగా చంద్రముఖిగా మారిన గంగ’లా లిల్లీ దర్శనమిస్తుంది. ఇంట్రవెల్ తరవాత… లిల్లీ అసలు మిషన్ ఏమిటో అర్థమవుతుంది. అక్కడ ‘లడ్డూ ఐడియా’ నిజంగానే ‘లడ్డూ’లానే ఉంటుంది. ఓ పెద్ద క్రిమినల్ ని చంపడానికి ఇంత సిల్లీ ప్లాన్ వేశారేంటి? అనిపిస్తుంది. కథ ట్రాక్ తప్పుతోందేమో, కామెడీ కూడా మిస్సవుతుందేమో అనుకొంటున్న దశలో ‘రాధిక’ పాత్రని రంగంలోకి దించేసి… మరోసారి థియేటర్ మొత్తం అలెర్ట్ అయ్యేలా చేశాడు దర్శకుడు. ఇద్దరు రాధికల్నీ పక్క పక్కన చూడడం, అక్కడ సిద్దూ ఫ్లాష్ బ్యాక్‌ని గుర్తు చేసుకొంటూ సుదీర్ఘమైన డైలాగులు చెప్పడం ఇవన్నీ హిలేరియస్‌గా నడిచిపోయాయి. చివరి 10 నిమిషాలూ మరోరకంగా సాగింది. అక్కడ కూడా ఓ ట్విస్ట్ ఉంటుందని ప్రేక్షకుడు ముందే ఊహిస్తాడు. మరీ అబ్బుర పరి చేసే మలుపు కాదు కానీ, ప్రేక్షకుల్ని సంతృప్తి పరుస్తుంది.
ఈ క్యారెక్టర్ని ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు అనిపించేంత స్టఫ్… టిల్లు పాత్రలో ఉంది. ఆ పాత్రని అంతలా పండించాడు సిద్దు జొన్నలగడ్డ. తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ.. తొలి భాగంలో చూసినట్టే ఉంది. అస్సలు మార్పు లేదు. కానీ మళ్లీ మళ్లీ చూడాలనిపించింది. ఈ సినిమాలో దాదాపు ప్రతీ సీన్లోనూ సిద్దు కనిపిస్తాడు. ఓరకంగా చెప్పాలంటే ఈ సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని మోశాడు. అనుపమ హాట్ గా ఉంది. లిప్ లాక్ సన్నివేశాల్లో ఏమాత్రం మొహమాట పడకుండా నటించింది. ఒకట్రెండు ముద్దులు మరీ సుదీర్ఘంగా సాగుతాయి. ఓ ఫైట్ సీన్లోనూ… ఊహించని ముద్దొకటి వచ్చిపోతుంది. అనుపమని పద్ధతిగా చూసినవాళ్లంతా ఈసారి షాక్ కి గురవుతారు. సిద్దు తండ్రిగా కనిపించిన మురళీధర్ కూడా బాగా నవ్వించాడు. కాకపోతే.. పైల్స్‌ని అడ్డు పెట్టుకొని రాసిన డైలాగులే.. కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. నేహా శెట్టి అతిథి పాత్రలో మెరిసింది. ఆమె ఎంట్రీ థియేటర్లో విజిల్స్ కొట్టిస్తుంది.
ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అన్నీ సిద్దు జొన్నలగడ్డే. కథకుడుగా ఎక్కువ మార్కులేం రావు కానీ, సంభాషణల రచయితగా నూటికి నూటొక్క మార్కులు వేయొచ్చు. టిల్లు పాత్రని పూర్తిగా అర్థం చేసుకొన్నాడు కాబట్టే.. అంత ఆసువుగా మాటలు రాసేశాడు. కొన్ని పోలికలు, ఛమక్కులు భలే పేలాయి. సీన్ అంతా ఒక ఎత్తు… చివర్లో టిల్లు చెప్పే డైలాగులు మరో ఎత్తు. టిల్లు ఎప్పుడు మాట్లాడతాడా, అని ఆడిటోరియం వెయిట్ చేస్తుంటుంది. అక్కడే ఈ సినిమా, ఆ పాత్రా పాసైపోయాయి. రెండు పాటలు థియేటర్‌కి కిక్ ఇస్తాయి. వాటిని ఫస్టాఫ్కి ఒకటి, సెకండాఫ్ కి మరోటి అంటూ పంచేసి మంచి టైమింగ్ సెట్ చేశారు. ఈ సినిమా నిడివి కూడా రెండు గంటల పదిహేను నిమిషాలు. షార్ప్ రన్ టైమ్ కలిసొచ్చే విషయం. అనుపమ లిప్ లాక్కులు, కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులూ ఫ్యామిలీ ఆడియన్స్‌ని కాస్త ఇబ్బంది పెడతాయి కానీ.. అవి పక్కన పెడితే, అన్ని వర్గాల వారికీ కావల్సినంత ఎంటర్టైన్మెంట్ కి ఢోకా లేదు. ముఖ్యంగా యూత్‌కీ బాగా ఎక్కేసే కంటెంట్ టిల్లులో ఉంది.
తెలుగు360 రేటింగ్ : 3/5
-అన్వర్