మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే బీజేపీ రాజకీయం ప్రారంభించింది. అది హిందూ ముస్లిం గొడవ ..అని.. ఒక్క చెంగిచెర్ల ఇష్యూ కాదని.. రాష్ట్రం మొత్తం ఇష్యూ అని ఒకరి తర్వాత ఒకరు పరామర్శలు ప్రారంభించారు.
మొదట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులను పరామర్శించారు. హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదన్నారు. తర్వాత బండి సంజయ్ బుధవారం పిలుపునిచ్చి మరీ చెంగిచెర్ల వెళ్లారు. బండి పిలుపుతో.. పెద్ద ఎత్తున బీజేపీ నేతలు, హిందూ సంఘాల నేతలు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాసేపు అక్కడి వాతావరణం రణరంగంగా మారింది. బీజేపీ కోరుకున్నట్లుగా స్టేట్ పొలిటికల్ ఇష్యూగా మారింది. బండి సంజయ్ తమ విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు కేసులు పెట్టారు. ఈ వివాదానికి కొనసాగింపుగా రాజాసింగ్ అక్కడకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు.
బీజేపీకి ఇలాంటి అవకాశాలు దొరికితే ఏం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే చేస్తుంది. ఈ ఇష్యూని ఇంతటితో వదిలే అవకాశం ఉండదు. ఎన్నికల అంశంగా మార్చుకున్నా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ విషయంలో బీజేపీ కార్నర్ చేయడానికి హిందూ, ముస్లిం అంశాలను ఎప్పుడూ ముందుకు తెస్తుంది. అందుకే ఈ విషయాన్నీ హైలెట్ చేస్తుంది. మరి తెలంగాణ ప్రజలు ఎలా తీసుకుంటారో !