ఇటీవల రష్యాలో ఎన్నికలు జరిగాయి. వ్లాదిమిర్ పుతిన్ 80 శాతం ఓట్లు తెచ్చుకున్నారు. తన గెలుపుతో రష్యా మరింత బలోపేతం అయిందని ఆయన ఘనంగా ప్రకటించుకున్నారు. పేరుకు అది ప్రజాస్వామ్యమే. ప్రజలు ఓట్లేశారు. మరి నిజంగా అవి ఎన్నికలేనా ఉంటే అంత కంటే కామెడీ ఉండదు. ప్రత్యర్థుల్ని పోటీ చేయనివ్వరు.. పుతిన్ ను వ్యతిరేకించే వారి ప్రాణాలకు గ్యారంటీ ఉండదు.. ఓట్లు వేసే వాళ్లకూ స్వతంత్రం ఉండదు. ప్రత్యర్థులుగా నిలబడిన వాళ్లు తమకు ఓట్లేయవద్దని.. పుతిన్ కే వేయాలని ప్రచారం చేయడం కామన్. అలాంటి ప్రజాస్వామ్యం దిశగా భారత్ వెళ్తోందా ? అనే అనుమానాలు ప్రపంచదేశాలతో పాటు ఐక్య రాజ్యసమితికి కూడా వస్తున్నాయి.
భారత్ లో ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ నడుస్తోంది. బీజేపీపై గట్టిగా పోరాడుతున్న ఓ ప్రతిపక్ష నేత, ముఖ్యమంత్రి జైలు పాలయ్యారు. అంతకు ముందే బెయిల్ ఇచ్చిన ఓ జడ్జి రాత్రికి రాత్రే బదిలీ అయ్యారు. తరవాత అరెస్టు జిగిపోయింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రూపాయి నిధులు అందకుండా ఖాతాల్ని బ్లాక్ చేశారు. న్యాయస్థానాల్లో ఊరట దక్కడం లేదు. తాజాగా పద్దెనిమిది వందల కోట్లు కట్టాలంటూ… ఎప్పుడో లెక్కలు తీసి నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ బయటకు కనిపిస్తున్నవి. కానీ ఈడీ అధికారులు ఎక్కడెక్క డ చేస్తున్న దాడులతో చెప్పుకోలేనంత భయానక వతావరణం వివిధ రాష్ట్రాల్లో ఉంది.
ప్రపంచంలోని ప్రజాస్వామ్య నియంతలు పాలిస్తున్న దేశాల్లో ఇదే జరుగుతుంది. వ్యవస్థలన్నింటినీ గుప్పిట పెట్టుకుని ప్రత్యర్థుల్ని జైలుకు పంపడం చేస్తూంటారు. ఇండియాలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. లిక్కర్ పాలసీలో కేజ్రీవాల్ అవినీతి చేస్తే… రెండేళ్లుగా చేయని అరెస్టు ఇప్పుడే ఎందుకు చేశారో అర్థం చేసుకోవచ్చు. అందుకే భారత్ లో ప్రజాస్వామ్య హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయని ఆశిస్తామని ఐక్యరాజ్య సమితి అంటోంది. భారత్ లో పరిణామాలపై.. అమెరికా, జర్మనీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అయితే ఇతర దేశాలు తమ అభిప్రాయాలను చెప్పడాన్ని భారత ప్రభుత్వం.. మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడంగా అభివర్ణించి కఠినంగా వ్యవహరిస్తోంది. అమెరికా అంబాసిడర్ ను పిలిపించి హెచ్చరించింది. ఇవి మన దేశ ఇమేజ్ ను అంతర్జాతీయ సమాజంలో ఎలా నిలబెడతాయో పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఆ అభిప్రాయాలను మన దేశంపై జరుగుతున్న కుట్రగా కాకుండా.. అందులో నిజాల గురించి ప్రజలు.. బుద్ది జీవులు .. తమ రాజకీయ, కుల, మత, ప్రాంత భావనలకు అతీతంగా ఆలోచిస్తే దేశానికి మేలు జరుగుతుంది. పార్టీల మత్తులోనే ఉండిపోతే మాత్రం.. ఐక్యరాజ్య సమితి కూడా సానుభూతి చూపిస్తుంది తప్ప ఏమీ చేయలేదు.