హీరోయిన కంగనా రనౌత్ రాజకీయాల్లోకి వచ్చారు. కొంత కాలం నుంచి ఆమె టార్గెట్ అదే. బీజేపీని పొగుడుతూ వస్తున్నారు ఆ ప్రయత్నాలు ఫలించాయి. హిమచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ టిక్కెట్ లభించింది. ఆమె పోటీ చేయబోతున్నారు. కానీ ఆమె అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ సోషల్ మీడియా బాధ్యతలు చూసే మహిళా నేత సుప్రియ శ్రీనాథే కంగన ఎక్స్ పోజింగ్ చేస్తున్న ఫోటోను పెట్టి ఇలాంటి వారిని అభ్యర్థులుగా నిలబెట్టి ఏం సందేశం ఇస్తారన్నట్లుగా విమర్శలు చేశారు.
ఇప్పుడు కాంగ్రెస్ మహిళా నేతపై బీజేపీ పూర్తి స్థాయిలో విరుచుకుపడుతోంది. మహిళల్ని అవమానిస్తున్నారని మండిపడుతోంది. చివరికి ఈ దాడి తట్టుకోలేక.. ఆ సోషల్ మీడియా పోస్టు తన ఖాతాలో పోస్ట్ అయినా తాను చేయలేదని చెప్పుకోవాల్సి వచ్చింది. కానీ చర్చ మాత్రం ఆగడం లేదు. గతంలో కంగన రనౌత్ తోటి నటులపై చేసిన వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. గతంలో కాంగ్రెస్ తరపున రాజకీయాల్లోకి వచ్చిన ఊర్మిళ మతోండ్కర్ ను సాఫ్ట్ పోర్న్ నటి అని తీసి పడేసింది కంగనా రనౌత్. ఊర్మిళ ఎలాంటి సినిమాల్లో చేసిందో అంత కంటే ఎక్కువ మసాలాలు ఉన్న సినిమాల్లో కంగన నటించింది. అయినా కాంగ్రెస్ తరపున.. తర్వాత శివసేనలో చేరినందున.. ఊర్మిళను ఆ మాట అనేసింది కంగన.
అప్పట్లో ఈ అంశం తప్పు అని ఎవరూ కంగనకు చెప్పలేదు. బీజేపీ నేతలు చెప్పలేదు. ఇప్పుడు బయటకు వస్తున్న మహిళా ఉద్దారక నేతలూ చెప్పలేదు. అంటే.. కంగన .. వ్యక్తిగత కక్ష పెట్టుకుని ఊర్మిళను అంటే తప్పు లేదు కానీ.. కాంగ్రెస్ నేత కంగనా అభ్యర్థిత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం పెద్ద రాజకీయం అయిపోయింది.
కంగన అభ్యర్థిత్వం తప్పు కాదు. బీజేపీ తరపునే కాదు.. ఏ పార్టీ తరపున అయినా కంగనకు రాజకీయాల్లోకి వచ్చే హక్కు వందకు వెయ్యి శాతం ఉంటుంది. కానీ ఆమెకు మాత్రమే మహిళా హక్కులు ఉంటాయన్నట్లుగా రాజకీయాలు చేయడమే వివాదానికి కారణం. గతంలో ఊర్మిళ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం చెందితే.. తనపై అలాంటి వ్యాఖ్యలు రాకుండా ఉండేవేమో ?.