ఏపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు డీఎస్సీ వేయలేదు. ఎన్నికలకు ముందు కోడ్ వస్తుందని తెలిసినా అడ్డగోలు రూల్స్ పెట్టి డీఎస్సీ ప్రకటన ఇచ్చారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ అని. డీఎస్సీ అని .. శిక్షణ అని మొత్తానికి వేల రూపాయలు ఒక్కో అభ్యర్థి ఖర్చు పెట్టుకుంటున్నారు. తేదీలు ఇచ్చారు కానీ పరీక్షలకు ఏర్పాట్లు చేయలేదు. చివరికి ఈసీ ఎన్నికల కోడ్ ముగిసే వరకూ డీఎస్సీ పెట్టవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆదేశాలు వస్తాయని తెలిసే డీఎస్సీ పరీక్షకు ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేయలేదు.
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఇస్తామని జగన్ రెడ్డి మోసం చేశారు. ఐదేళ్ల పాటు ఆయన ఒక్క డీఎస్సీ కూడా వేయలేదు. అలా వేయకపోగా నిరుద్యోగుల నుంచి ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేసుకున్నారు. చివరికి పరీక్ష కూడా పెట్టకుండానే ఎన్నికలకు వెళ్తున్నారు. నిరుద్యోగుల్ని ముఖ్యంగా టీచర్లు అవ్వాలనుకున్న వారిని జగన్ రెడ్డి .. మోసం చేయడం కాకుండా.. వారి వద్ద డబ్బులు కూడా పరీక్ష ఫీజుల రూపంలో లాగించేయడం .. వారిలో మరింత ఆసహనానికి కారణమయ్యేలా చేస్తోంది.
వాలంటీర్లను అవసరాన్ని బట్టి ఉద్యోగులుగా చెప్పుకుంటూ వస్తున్నారు. జీతాలు పెంచాల్సి వస్తే.. వారు సేవకులు అంటారు. కానీ ప్రజాధనాన్ని జీతాలుగా ఇచ్చి వారిని పార్టీ కోసం పని చేయించుకున్నారు. అంతే కానీ.. గ్రూప్స్ కానీ.. డీఎస్సీ కానీ ఎప్పుడూ భర్తీ చేసిన పాపాన పోలేదు. పైగా.. గత ప్రభుత్వం వేసిన గ్రూప్ వన్ పోస్టులు వాల్యూయేషన్ మ్యానిప్యులేట్ చేసి.. ఉద్యోగాల్ని అమ్ముకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.