వైసీపీకి చెందిన దళిత ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, బీజేపీల్లో చేరి టిక్కెట్లు తెచ్చుకున్నారు. ఎంతో మంది రెడ్డి సామాజికవర్గ నేతలపై భయంకరమైన వ్యతిరేకత ఉన్నా వారి జోలికి వెళ్లలేదు. కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందిన వారికి మాత్రం టిక్కెట్లు గల్లంతు అయ్యాయి. వారు చేసిన తప్పేమిటి అంటే.. సొంతంగా ఏదో చేయాలనుకోవడం.. సొంత అభిప్రాయాలను వెల్లడించడం, పెత్తందారులుగా ఉన్న వైసీపీ నేతల ఆదేశాలను ధిక్కరించడమే. తాము చెప్పినట్లే చేస్తామన్న వారికి ఇతర చోట్ల అవకాశాలు కల్పించారు. ధిక్కరించిన వారిని బయటకు వెళ్లిపోయేలా చేశారు.
మైలవరం నియోజవకర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ బయటకు వెళ్లిపోయారు. ఆయన స్థానంలో తిరుపతిరావు అనే బీసీ వర్గానికి చెందిన నేతను ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టి గొప్పగా ప్రచారం చేసుకున్నారు. కానీ అక్కడ మొత్తం పెత్తందారు ఓ రెడ్డి సామాజికవర్గం నేత. తిరుపతి రావును గుప్పిట్లో పెట్టుకుని అన్నీ తానే చేస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రిజర్వుడు నియోజకవర్గాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. ఎవర్నీ నోరెత్తనీయరు. ఎన్నికల పనులు కూడా రెడ్డి సామాజికవర్గ నేతలే చేస్తూంటారు. వారి పెత్తనం లేదంటే టిక్కెట్ గల్లంతవుతుంది. మైనార్టీలకు టిక్కెట్లు ఇచ్చినా వారిలో ఒక్కరైనా నోరు విప్పి మాట్లాడేవారు ఉండరు. పేరుకే డిప్యూటీ సీఎం ఆంజాద్ భాషా. ఆయనకు తన శాఖలో ఒక్క అధికారి కూడా రిపోర్టు చేయరు.
అదే సమయంలో టీడీపీలో గట్టిగా దళిత వాదం వినిపించే నేతలకు టిక్కెట్లు ఇస్తే వారిపై విషం చల్లుతారు. వారిని ఎన్నికల బరి నుంచి వైదొలిగేలా వేధిస్తున్నారు. దళితుల్లో చైతన్యం తెస్తారని అనిపిస్తే చాలు వారందరిపై పెరిగే వేధింపులు అన్నీ ఇన్నీ కావు. అన్ని రాజకీయ పదవుల విషయంలోనూ ఇదే వ్యూహం. చివరికి అధికారుల విషయంలోనూ అదే ప్లాన్. అణిగిమణిగి ఉండే అధికారులను తీసుకుని వారిపై రెడ్డి వర్గం పెత్తనం పెట్టి పాలన సాగిస్తున్నారు. మళ్లీ దీనికి పెద్ద పెద్ద డైలాగులు చెబుతూంటారు.