గంటా శ్రీనివాసరావు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క సారి కూడా ఓడిపోలేదు. అలాగని ఆయన రెండో సారి తాను గెలిచిన నియోజకవర్గంలో పోటీ చేయలేదు. ఈ సారి మాత్రం గతంలో గెలిచిన నియోజకవర్గం భీమిలి నుంచి మరోసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. పట్టుబట్టి టిక్కెట్ దక్కించుకున్నారు.
గత ఎన్నికల్లో గెలిచిన విశాఖ నార్త్ నుంచి పోటీ చేయదల్చుకోలేదు. మరో నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. అయన కోరిక తీర్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని సూచించారు. కానీ గంటా మాత్రం.. సింపుల్ గా గెలిచే సీటుపైనే దృష్టి పెట్టారు. సెంటిమెంట్‌కు విరుద్ధంగా గతంలో పోటీ చేసి గెలిచిన భీమిలిని ఎంచుకున్నారు. భీమిలి నియోజకవర్గంలోనే రెండోసారి పోటీ చేస్తున్నారు.
గంటా శ్రీనివాసరావు భీమిలీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అక్కడ మంచి ఫలితాలు సాధించింది. గట్టి క్యాడర్ ఉంది. గంటా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించే వారు లేరు. అదే సమయంలో జనసేన తో పొత్తు కలసి వస్తుంది. టీడీపీ, జనసేన కలిస్తే భీమిలీలో ఏకపక్ష ఎన్నిక జరుగుతుందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈ సారి సెంటిమెంట్ బ్రేక్ చేసినా గెలుపు దగ్గరకే వెళ్తానని గంటా గట్టి నమ్మకంతో ఉన్నారు.