తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దివంగత నందమూరి హరికృష్ణ కూతురు, టీడీపీ నాయకురాలు నందమూరి సుహాసిని శనివారం కలిశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు. లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను సుహాసిని కలవడం ఆసక్తికరంగా మారింది. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి సుహాసిని పోటీ చేశారు. సుహాసిని ప్రస్తుతం తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు సాగుతోంది. వివిధ పార్టీల నేతల్ని.. కాంగ్రెస్ నేతలు ఆకర్షిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బారీ విజయమే లక్ష్యంగా నేతల్ని ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో నందమూరి సుహాసినితోనూ చర్చలు జరిపినట్లుగా భావిస్తున్నారు. మర్యాదపూర్వక భేటీ అయితే.. దీపాదాస్ మున్షితో పాటు మల్కాజిగిరి సీటుకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా ఈ సమావేశానికి హాజరవ్వాల్సిన అవసరం ఉండదని భావిస్తున్నారు. ఖచ్చితంగా రాజకీయ ఎజెండాతోనే సమావేశం జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరింది.కానీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేయలేదు. దీంతో టీడీపీ నేతలంతా నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో నందమూరి సుహానికి కాంగ్రెస్ పార్టీ లో చేరి రాజకీయంగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఖమ్మం నియోజకవర్గానికి ఆమె పేరు కూడా పరిశీలిస్తున్నారని అంటున్నారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబ్టటి.. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు కీలకం అయ్యే అవకాశం ఉంది. పోటీ హోరాహోరీగా సాగుతుందని భావిస్తున్న సమయంలో సుహాసిని… కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ ఆసక్తికరంగా మారింది.