వైసీపీ వాలంటీర్లను ఎన్నికలకు ఉపయోగించుకునేందుకు ఆటంకాలు ఏర్పడుతూండటంతో గ్రామ సచివాలయ వాలంటీర్లను వ్యూహాత్మకంగా రాజీనామాల బాట పట్టిస్తున్నారు వైసీపీ నేతలు. రాజీనామాలు చేయించి.. ఈ రెండు, మూడు నెలల జీతం తామే ఇస్తామని వైసీపీకి ప్రచారం చేయాలని అంటున్నారు. వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను పంపిణీ చేయడమే కాకుండా, పార్టీకి ప్రచారం చేస్తున్నారు. యాభై ఇళ్ల సమాచారం సేకరించి ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని ధీమాతో వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. ఆ ధైర్యంతోనే గ్రామాల్లో ఉన్న వార్డు సచివాలయ వాలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నారు. కొన్ని చోట్ల వాలంటీర్లు రాజీనామాలు చేయడానికి నిరాకరిస్తే.. వారితో బలవంతంగా రాజీనామాలు చేయిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వాలంటీర్లు రాజీనామా చేసి రావాలని ఒత్తిడి చేస్తున్నారు. మళ్లీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తుంది, మళ్లీ మిమ్మల్ని తీసుకుంటాం అని భరోసా ఇస్తున్నారు.
ఒక్క సారి రాజీనామా చేశారు అంటే.. ఇక వాలంటీర్ కానట్లే. వైసీపీకి పని చేసుకోవచ్చు.. చేయకపోవచ్చు.. వైసీపీ ప్రభుత్వం వస్తే మళ్లీ వారికి వాలంటీర్ పోస్ట్ ఇస్తారు. మరి ప్రభుత్వం మారితే. ,ఏదీ రాదు. ఉన్న అవకాశం పోయినట్లవుతుంది. ఎందుకంటే ఉన్న వాలంటీర్ల సంక్షేమం చూసుకుంటానని చంద్రబాబు చెబుతున్నారు. రాజీనామాలు చేసి..వైసీపీ కోసం పని చేసిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉండదు. పైగా.. చేసినతప్పులకు కేసులు పెట్టినా ఆశ్చర్యం ఉండదు. అందుకే వాలంటీర్ల వ్యవహారం ఏపీలో మలుపులు తిరుగుతోంది