ఇది వరకు కథానాయికలు ఎక్కువగా ‘అరువు’ గొంతులపై ఆధారపడిపోయేవాళ్లు. సినిమా ఫంక్షన్లలో వచ్చీ రాని తెలుగుతో తెగ కామెడీ చేసేవాళ్లు. ఇప్పుడు అలా కాదు. కష్టపడి మరీ తెలుగు నేర్చుకొంటున్నారు. తమ డబ్బింగ్ తామే చెప్పుకొంటున్నారు. ఈ జాబితాలో రష్మిక కూడా ఉంటుంది. చాలా కాలంగా రష్మిక తన డబ్బింగ్ తానే చెప్పుకొంటోంది. ‘పుష్ప’ కోసం చిత్తూరు యాస నేర్చుకొని మరీ డైలాగులు పలికింది. తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనూ ఇంతే. ‘యానిమల్’ కోసం హిందీలోనూ తన గొంతు వినిపించింది. ‘యానిమల్’ కన్నడ వెర్షన్ కుసైతం సొంతంగా డబ్బింగ్ చెప్పుకొంది. ఇప్పుడు ఏకంగా ఐదు భాషల్లో తన గొంతు వినిపించబోతోంది. రష్మిక తాజా చిత్రం ‘గాళ్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. ఈనెల 5న రష్మిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘గాళ్ ఫ్రెండ్’ టీజర్ విడుదల కానుంది. టీజర్ వెర్షన్‌కు డబ్బింగ్ పూర్తయ్యింది. అన్ని భాషల్లోనూ రష్మికనే డబ్బింగ్ చెప్పుకొంటోంది. మలయాళంలో రష్మిక డబ్బింగ్ చెప్పుకోవడం ఇదే తొలిసారి. అయితే ఈ ప్రయోగం టీజర్‌తోనే సరా, సినిమా మొత్తం రష్మిక డబ్బింగ్ చెప్పేస్తుందా అనేది మాత్రం తేలాల్సివుంది. తెలుగు, కన్నడ, హిందీల్లో మాత్రం రష్మిక డబ్బింగ్ చెబుతుందని, మిగిలిన భాషలకు సమయాన్ని బట్టి రష్మిక నిర్ణయం తీసుకొంటుందని దర్శకుడు రాహుల్ రవీంద్రన్ చెబుతున్నారు.