జనసేన పార్టీ పెండింగ్ లో ఉన్న రెండు స్థానాలకు టీడీపీ నేతల్ని చేర్చుకుంది. వారికే అభ్యర్థిత్వాలు ఖరారు చేయడం లాంచనమే అనుకోవచ్చు. అవనిగడ్డ నియోజవర్గం నుంచి సీనియర్ నేత మండలి బుద్దప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. అవనిగడ్డ నియోజకవర్గం టీడీపీకి వస్తే ఆయనే అభ్యర్థి. ఆయన బలమైన నేత కావడంతో.. జనసేన పార్టీ చీఫ్ కూడా ఆయననే పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. నిజానికి వైసీపీ కూడా మండలి బుద్దప్రసాద్ కు ఆఫర్ ఇచ్చింది. కానీ ఆయన చేరలేదు. దీంతో చివరికి సిట్టింగ్ ఎమ్మెల్యేకే ఖరారు చేశారు.
పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత నిమ్మక జయకృష్ణ కూడా జనసేన పార్టీలో చేరారు. ఆయన టీడీపీ అభ్యర్థిత్వ రేసులో ముందున్నారు. కానీ సీటు జనసేన ఖాతాలో చేరింది. దీంతో ఆయన కూడా జనసేనలో చేరి…కూటమి అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. జనసేన పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడంతో పవన్ కూడా అంగీకరించారు. పిఠాపురంలో వీరు తమ అనుచరులతో కలిసి పార్టీలో చేరారు.
రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీలో ఉన్న కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేసినా వీరికే అధికారికంగా అభ్యర్థిత్వం ప్రకటించనున్నారు. వీరిద్దరితో జనసేన పార్టీ జాబితా కూడా పూర్తవుతుంది. విశాఖ దక్షిణం నంచి వంశీకృష్ణ యాదవ్‌కే పవన్ ఖరారు చేశారు.