లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీకి తెలుగు నేలతో గొప్ప అనుబంధం వుంది. అంతర్జాతీయ క్రికెట్లో ధోని సత్తా చాటింది తెలుగు గెడ్డపైనే. ధోని తొలి సెంచరీ కొట్టింది విశాఖ తీరంలోనే. పాకిస్థాన్ పై సాధించిన 148 పరుగులు ప్రపంచానికి ధోనిలోని దమ్ముని పరిచయం చేశాయి. ఈ మ్యాచ్ కి ఆదిత్యం ఇచ్చింది విశాఖపట్నం. తర్వాత ధోని ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో అందరికీ తెలుసు. దేశానికి రెండు వరల్డ్ కప్పులు సాధించి పెట్టిన సారధిగా చరిత్రలో నిలిచిపోయాడు.
ఇప్పుడు తను తొలిసారి మెరిసిన తెలుగు నేల విశాఖకు మర్చిపోలేని బహుమతి ఇచ్చేశాడు ధోని. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. అయితే ఆ జట్టుకి ఆడుతున్న ధోని బ్యాటింగ్ కి రాకపోవడం అభిమానులని నిరాశ పరిచింది. విశాఖలో ఈ నిరాశని తీర్చేశాడు ధోని. ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన మ్యాచ్ కు విశాఖ వెదికైయింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. కానీ ధోని ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకున్నారు. కారణం.. బ్యాటింగ్ కి దిగిన ధోని దంచేశాడు. కళ్ళు చెదిరిపోయే వింటేజ్ షాట్స్ ఆడాడు. సింగిల్ హ్యాండ్ తో కొట్టిన సిక్స్ మెస్మరైజింగ్. 16 బంతులాడిన ధోని నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో చెలరిగిపోయాడు. ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ధోని ఫ్యాన్స్ లో నిరాశ లేదు.
నిజానికి ధోని ఆట చూడటానికే వేల రూపాయిలు ఖర్చు చేసి స్టేడియంలోకి వెళుతున్నారు అభిమానులు. పైగా ఇది ధోనికి చివరి సీజన్ అంటున్నారు. అందుకే కెప్టెన్సీ కూడా వదిలేసి జట్టుని ప్రిపేర్ చేశాడు. ఇప్పటికే అన్ని ఫార్మెట్స్ నుంచి తప్పుకున్న ధోనికి.. ఈ ఐపిఎల్ తర్వాత మళ్ళీ అంతర్జాతీయ మైదానంలో ఆడే అవకాశం ఎలా వుంటుందో తెలీదు. ఈ నేపధ్యంలో చాలా మంది ఫ్యాన్స్ కేవలం ధోనిని చూడటానికే టికెట్స్ కొంటున్నారు. హైదరాబాద్ వేదికగా జరిగే చెన్నై మ్యాచ్ టికెట్లు నిమిషాల్లో సొల్ద్ అవుట్ అయిపోయాయి. కారణం.. హైదాబాద్ మైదానంలో ధోని ఆటని చివరిసారిగా చూడలనే కోరికతో టికెట్లకి రెక్కలొచ్చేశాయి. ఇలాంటి నేపధ్యంలో తను తొలి సెంచరి సాధించిన తెలుగు గెడ్డపై తన భీవత్సమైన బాదుడుతో అభిమానులు గుర్తుపెట్టుకునే ఇన్నింగ్ ఆడి విశాఖ తీరాన్ని, తెలుగు అభిమానులని అలరించాడు ధోని.