పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఆయన త్వరలో కలం పట్టి సినీ రచయితగా కూడా మారబోతున్నారు. ఆయన ‘ఫిలిం కంపానియన్’ అనే పత్రికకు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆ విషయం చెప్పారు. గత ఎన్నికలకు ముందు రాజకీయాలలో రావాలనే ఉద్దేశ్యంతోనే ఆయన జనసేన పార్టీ స్థాపించినప్పటికీ విభజన తరువాత రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తెదేపా-బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి తను ఎన్నికలకి దూరంగా ఉన్నారు. ఆ తరువాత మళ్ళీ సినీ పరిశ్రమలోకి తిరిగివెళ్ళిపోయారు. అడపాదడపా ప్రజా సమస్యలపై మాట్లాడటం తప్ప రాజకీయాలలోకి ప్రవేశించే ప్రయత్నం చేయలేదు. అయితే రాజకీయాల నుండి తాను తప్పుకోవాలనుకోవడం లేదని ఆయన ఫిలిం కంపానియన్ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేసారు. మరికొంత కాలం తరువాత తను రాజకీయాలలోకి రావాలనుకొంటున్నానని ఆయన తెలిపారు. ఈలోగా తన వర్తమాన రాజకీయాలపై ఆలోచనలను, ఆశయాలను ప్రతిబింబించే విధంగా కధలు వ్రాసుకొని వాటితో సినిమాలు తీయలనుకొంటున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.