ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన ఏకైక జట్టు… ముంబై ఇండియన్స్. స్టార్ ప్లేయర్స్‌తో నిండిపోయిన టీమ్ అది. అందరూ మ్యాచ్ విన్నర్లే. ముంబైతో పోరంటే.. ఏ జట్టుకైనా ఒణుకు పుట్టాల్సిందే. అలాంటి జట్టు ఈ ఐపీఎల్ లో ఘోరమైన ప్రదర్శన చేస్తోంది. 3 మ్యాచ్‌లు ఆడితే… అన్నీ ఓటములే. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. మరో ఒకట్రెండు ఓటములు ఎదురైతే… ట్రోఫీ మాట అటుంచండి. ప్లే ఆఫ్స్‌కి చేరుకోవడం కూడా కష్టమే. అరివీరభయంకరమైన ప్రపంచస్థాయి ఆటగాళ్లతో నిండిన జట్టు.. హ్యాట్రిక్ ఓటములు మూటగట్టుకోవడం అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ప్రత్యర్థికి రికార్డు స్కోరు సమర్పించుకొంది. సోమవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే… ముంబై బ్యాటర్లు మరీ ఘోరంగా ఆడారు. కేవలం పట్టుమని 130 పరుగులు కూడా చేయలేకపోయారు. బౌలర్లు తేలిపోయారు. హార్దిక్ పాండ్యా క్యాచ్‌లు వదిలేశాడు. ఏ రూపంలో చూసినా ప్రమాణాలకంటే తక్కువ స్థాయి ఆటతీరు కనబరుస్తున్నారు. రోహిత్ ఇంకా తన క్లాస్ చూపించలేదు. కిషన్ ఫామ్‌లో లేడు. తిలక్ వర్మ ఆడుతున్నా సరిపోవడం లేదు. సూర్య కుమార్ లాంటి వాళ్లు అందుబాటులో లేరు. బుమ్రా మ్యాజిక్ ఇంకా మొదలవ్వలేదు. అసలు హార్దిక్ పాండ్యా ఏం చేస్తున్నాడో తనకే అర్థం కావడం లేదు. జట్టుని ఆదుకోవాల్సిన కీలక సమయంలో ఔటై.. ముంబైపై మరింత ఒత్తిడి పెంచుతున్నాడు.
ఆటగాళ్ల వైఫల్యంతో పాటు జట్టులో టీమ్ స్పిరిట్ లోపించడం కూడా ఓకారణంగా కనిపిస్తోంది. కెప్టెన్సీ మార్పు జట్టులో చాలామంది ఆటగాళ్లకు నచ్చలేదు. ఇంకా తమ కెప్టెన్ రోహిత్ అనే అనుకొంటున్నారు. హార్దిక్ కూడా సీనియర్లని తగిన రీతిలో గౌరవించడం లేదన్న విమర్శ ఉంది. అందరినీ కలుపుకొని పోవడంలో హార్దిక్ విఫలం అవుతున్నాడు. అసలు హార్దిక్ కెప్టెన్సీకి తగిన వ్యక్తా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన కెరీర్లోనే పూర్ ఫామ్ లో ఉన్న హార్దిక్ పాండ్యా ఆటగాడిగా జట్టులో స్థానం సంపాదించడమే కష్టం. అలాంటిది కెప్టెన్ భారాన్ని ఎలా మోయగలుగుతుతాడు? అనేదే పెద్ద ప్రశ్న. ముంబై మేనేజ్మెంట్ ఈ విషయంలో ఆలోచించాల్సిందే. కాకపోతే.. టోర్నీ ఇంకా ఆరంభదశలోనే ఉంది. మూడు మ్యాచ్‌లు పోయిన తరవాత కూడా పుంజుకొని కప్పు కొట్టిన దాఖలాలు చాలా ఉన్నాయి. ముంబై కూడా అలానే మ్యాజిక్ చేస్తుందని అభిమానుల ఆశ.