బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దక్కించుకున్న దానం నాగేందర్ కు ఆ పార్టీ ఝలక్ ఇవ్వబోతుందా…? పార్టీ పెద్దలతో ఆయన పెడుతున్న రోజుకో కండీషన్ తో పార్టీ విసిగిపోయిందా…? ఇంతకు దానం పెట్టిన కొత్త కండీషన్ ఏంటీ?
దానం నాగేందర్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఏరీ కోరి మరీ దానంను పార్టీలోకి తీసుకొని, ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. దానం పెట్టిన కొన్ని కండీషన్లకు పార్టీ కూడా ఒప్పుకుంది. తాను ముందుగా రాజీనామా చేయనని, ఎంపీగా గెలిచాకే చేస్తానని దానం పెట్టిన కండీషన్ కు ఓకే చెప్పింది.
కానీ ఇప్పుడు దానం కొత్త కండీషన్స్ పెడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాను ఓడిపోతే మంత్రిపదవి ఇవ్వాలని, ఎంపీగా గెలిస్తే ఖాళీ అయ్యే ఖైరతాబాద్ స్థానం నుండి తన అల్లుడికి సీటు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ పెద్దలు దానంను మార్చే ఆలోచనలో పడ్డట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన దానం… పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లారు. కానీ అందులో ఓటమి పాలయ్యారు. గత అనుభవాల దృష్ట్యా మరోసారి ఆ తప్పు చేయబోనని, ముందే తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తన సన్నిహితులతో చెప్తున్నారని తెలుస్తోంది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కొందరి సీట్లు ప్రకటించాక మార్చి కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ నుండి దానంను మార్చే అవకాశం లేకపోలేదని… దానంను మారిస్తే బొంతు రామ్మోహన్ కు అవకాశం రావొచ్చని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అయితే, కండీషన్ల విషయంలో దానం మెత్తబడితే మాత్రం… తనతోనే ఎన్నికలు వెళ్లే అవకాశాలు కూడా లేకపోలేదు.