మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మార్పు కనిపించింది. ఇది వరకటి కంటే వేగంగా సినిమాలు చేస్తున్నారు. యువ దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఓ దశలో చిరు మూడు సినిమాలు (గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య) ఒకేసారి సెట్స్‌పై ఉన్నాయి. చిరు కెరీర్లో ఇలా జరగడం చాలా అరుదు. ఈ స్పీడ్ చాలామందిని ఆశ్చర్యపరిచింది. చిరంజీవి లాంటి ఓ అగ్ర కథానాయకుడు… యువతరంతో పోటీ పడి సినిమాలు చేయడం అభినందించదగిన విషయం. అయితే.. ఇప్పుడు మళ్లీ చిరు ఆచి తూచి అడుగులేయడం కనిపిస్తోంది. ‘భోళా శంకర్’ ఫ్లాప్ తో చిరు మళ్లీ అలర్ట్ అయ్యారు. ఆయన చేతిలో ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఉంది. అదే… ‘విశ్వంభర’. ఈ సినిమా తరవాత చిరు ప్రాజెక్ట్ ఏమిటన్న సందిగ్థం నెలకొంది. అయితే చిరు చుట్టూ దాదాపు పదిమంది దర్శకులు కథలో రెడీగా ఉన్నారు. నిర్మాతలు అడ్వాన్సులు ఇవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ చిరు ‘డైలామా’ మాత్రం వదలడం లేదు.
హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, మారుతి, తమిళ దర్శకుడు హరి, కల్యాణ్ కృష్ణ, నక్కిన త్రినాథరావు, అనుదీప్… ఇలా చిరు కోసం కథలు సిద్ధం చేసుకొన్న దర్శకుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ పోతోంది. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ వీళ్లు కూడా చిరుతో ఓ సినిమా చేయాలని అనుకొంటున్నారు. కానీ… కథలు ఫిక్సవ్వడం లేదు. నిజానికి ‘విశ్వంభర’తో పాటు సమాంతరంగా ఓ సినిమా మొదలెట్టాలని చిరు అనుకొన్నారు. కానీ ఆ ప్రతిపాదన పక్కన పెట్టారు. ‘విశ్వంభర’ పనులు ఓ కొలిక్కి వచ్చేంత వరకూ మరో సినిమా మొదలెట్టకూడదని చిరు భావిస్తున్నారు. అందుకే కథలతో దర్శకులు రెడీగా ఉన్నా చిరు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పైగా.. కథ పూర్తి స్థాయిలో నచ్చితే తప్ప గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. అన్నింటికి మించి ఉరుకులు పరుగుల మీద సినిమాలు చేసేయడం కూడా చిరుకి ఇష్టం లేదు. ఆ అవసరం రాలేదు. ఈ పదిమందిలో ఎవరి కథ ఎంచుకోవాలన్న డైలామా మాత్రం చిరుకి ఉంది. అన్నివిధాలా పర్ఫెక్ట్ అనుకొన్న తరవాతే ప్రాజెక్ట్‌ని ప్రకటించాలని చిరు ఓ నియమంగా పెట్టుకొన్నారు. అందుకే తదుపరి సినిమా విషయంలో ఇంత ఆలస్యం జరుగుతోంది. అయితే ఈ క్యూ మాత్రం ఆగడం లేదు. రోజుకో దర్శకుడి పేరు వెలుగులోకి వస్తోంది. ఈ లిస్ట్ ఎంత వరకూ పెరుగుతుందో చూడాలి.