చిరంజీవి – వశిష్ట కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న సినిమా ‘విశ్వంభర’. త్రిష కథానాయికగా నటిస్తోంది. కొత్త షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ లో మొదలైంది. ప్రస్తుతం చిరంజీవిపై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఇందుకోసం ఓ భారీ సెట్ వేశారు. రామ్ లక్ష్మణ్ ఈ యాక్షన్ దృశ్యాలకు నేతృత్వం వహిస్తున్నారు. 2025 సంక్రాంతి లక్ష్యంగా రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. చిరు భీమవరం దొరబాబు పాత్రలో కనిపించబోతున్నాడు. సోషియో ఫాంటసీ మిక్స్ చేసిన ఈ కథలో త్రిష దేవకన్యగా దర్శనం ఇవ్వబోతోంది.
కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే రెండు పాటల చిత్రీకరణ కూడా పూర్తయిపోయింది. జూన్ – జులై నాటికి షూటింగ్ పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్‌కి ఎక్కువ సమయం కావాల్సివుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్‌కి ఈ సినిమాలో పెద్ద పీట వేశారు. వశిష్ట ఊహల్లోని కొత్త లోకాలకు ప్రాణం పోయాలంటే వీఎఫ్ఎక్స్ డిపార్ట్ మెంట్ కష్టపడాల్సిందే. అందుకే… వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని భారీ వ్యయంతో తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే.