వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై తాను ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఎక్కడ చెబితే అక్కడ చర్చకు సిద్ధమని సీఎం జగన్కు వైఎస్ సునీతారెడ్డి సవాల్ చేశారు. సీఎం జగన్కు చెందిన చానల్లో రమ్మన్నా చర్చకు వస్తానని సునీత స్పష్టం చేశారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందని తేల్చి చెప్పారు. కడపలో మీడియా సమావేశం నిర్వహించిన షర్మిల జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
ప్రచార బహిరంగసభల్లో జగన్మోహన్ రెడ్డి .. వివేకా హత్యను ఎవరు చేశారో దేవుడికి.. ప్రజలకు తెలుసుంటూ.. చేస్తున్న కామెంట్లపై సునీత స్పందించారు. ప్రజలు చాలా తెలివైన వారని, ప్రతిసారీ మోసపోరని అన్నారు. నిజమేంటో ప్రజలకు బాగా తెలుసునని, ప్రతిసారి ఎవరూ అందరినీ మోసం చేయలేరని అన్నారు. ఏం జరిగిందో కడప ప్రజలకు అంతా తెలుసునని, అన్న సీఎం జగన్ కడప ప్రజల్లో మనిషే కదా?.. ఆయనకు అంత భయమెందుకని ప్రశ్నించారు. వారు ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.
వైఎస్సార్సీపీ పునాదులు రక్తంతో తడిసిపోయాయని.. ప్రతి ఒక్కరూ వైఎస్సార్సీపీ నుంచి బయటకు రావాలన్నారు. లేకపోతే ఆ పాపం చుట్టుకుంటుందని.. అందరూ ధైర్యాన్ని ఓటు ద్వారా చూపిద్దామన్నారు. తన అన్న పార్టీకి ఓటు వేయొద్దు, జగనన్న పార్టీని ఎన్నికల్లో గెలవనీయకూడదన్నారు. వైసీపీ కోసం షర్మిల ఎంతో కష్టపడిందని, జగన్ జైలు నుంచి బయటకు వచ్చాక షర్మిలకు భయపడి ఆమెను దూరం పెట్టారన్నారు. జగనన్న జైలుకు వెళ్లిన సమయంలో షర్మిల పాదయాత్ర చేశారని.. ఆ తర్వాత ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించిన విషయాన్ని సునీత గుర్తు చేశారు. కష్టపడి పనిచేసి గెలిపించిన షర్మిలను చూసి జగన్ భయపడ్డారన్నారు. తనకంటే షర్మిలకు మంచి పేరు వస్తుందని జగన్ భయపడ్డారన్నారు.
చెల్లెళ్లను తనపై యుద్ధానికి పంపుతున్నారని ప్రజల ముందు సానుభూతి నాటకాలు నిస్సంకోచంగా ఆడుతున్న జగన్మోహన్ రెడ్డి అదే చెల్లెళ్లు కడప నడిబొడ్డు నుంచి విసురుతున్న సవాళ్లు మాత్రం కనిపించడం లేదు.. వినిపించడం లేదు. ఎందుకంటే వారు అడిగే ప్రశ్నలకు ఆయన వద్ధ సమాధానం ఉండదు మరి.