పాఠాలను చెప్పాల్సిన లెక్చరర్ లైంగికంగా వేధించాడు. న్యాయం కావాలని పోలీసులను కోరితే బెదిరించారు. ఫలితం రెండు పదులు కూడా నిండని విద్యార్ధిని ప్రాణం గాల్లో కలిసిపోయింది. ఈ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరు ఖాకీల బాధ్యతారాహిత్యాన్ని కళ్ళకు కట్టినట్లు ఉందనే విమర్శలు వస్తున్నాయి.
విశాఖ కొమ్మాది చైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో డిప్లమా మొదటి సంవత్సరం చదువుతోన్న రూప శ్రీ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతుండగా…పోలీసులు వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అవుతోంది. కాలేజ్ లో లెక్చరర్లు లైంగిక వేధింపులు భరించలేక కాలేజ్ భవనం పైనుంచి దూకి రూప శ్రీ ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. తన చావుకు లైంగిక వేధింపులే కారణమని ఘటన స్థలిలో సూసైడ్ లెటర్ లభ్యమైనా… రూప శ్రీ డెడ్ బాడీపై ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడంతో ఇది హత్య అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా కాలేజ్ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు ఆజ్యం పోస్తోంది.
రూప శ్రీ మరణంకు ముందే కాలేజ్ లో లైంగిక వేధింపులను కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా వివరించింది. దాంతో రూప శ్రీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఈ విషయమై వివరించగా.. తాము ఎన్నికల ప్రచార బందోబస్తు, ఐపీఎల్ లో బిజీగా ఉన్నామని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలిపారు. ఓ విద్యార్ధిని ఆపదలో ఉందని చెప్పినా ఆ విషయాన్ని పక్కనపెట్టేసి… ఐపీఎల్ షోపై ఫోకస్ పెట్టడంతో ఓ నిండు ప్రాణం బలైనట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.
రూప శ్రీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగాస్పందించి కాలేజ్ వ్యవహారాలపై ఫోకస్ చేసుంటే రూప శ్రీ సజీవంగా ఉండేది అని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో సంచలనం రేపిన దిశా ఘటనపై పోలీసుల మొదటి రియాక్షన్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తమ కూతురు కనిపించడం లేదని పేరెంట్స్ ఫిర్యాదు చేస్తే ఎవరితో వెళ్ళిందో కనుకోండి అనే నిర్లక్ష్యపూరిత సమాధానం చెప్పారని…ఫిర్యాదుపై సకాలంలో కదిలుంటే తమ కూతురు తమ ముందే ఉండేదని ఆవేదన , ఆక్రోశాన్ని వెళ్లగక్కారు.
పోలీసుల నిర్లక్ష్యంపై జనాల తిరుగుబాటుతో నిందితులను ఎన్ కౌంటర్ చేసి ఆగ్రహాన్ని చల్లబర్చారు. ఇప్పుడు రూప శ్రీ ఘటనలోనూ పోలీసులు అదే విధంగా స్పందించకపోయినా వ్యవహరించిన తీరు మాత్రమే ఒకటే…నిర్లక్ష్యం. ఆపదలో ఉన్నారని ఫిర్యాదులు వస్తే ఏ కేసును ప్రాధాన్యతగా చూడాలో తెలియని అమాయకులా పోలీసులు..? కాదు. సత్వర న్యాయం కోసం రాజకీయ, కుల కంపు కొడుతోన్న పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలేమో.