విజయ్ దేవరకొండ మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంటుంది. ‘ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొట్టి తీరతాం’ అని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతుంటాడు. కొన్నిసార్లు అది ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపిస్తుంటుంది. `లైగర్` సమయంలో అదే జరిగింది. ‘ఈ సినిమాతో రూ.200 కోట్లు కొడతా’ అని అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చాడు. సినిమా ఫ్లాప్ అయిన తరవాత విజయ్‌ని అందరూ ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇప్పుడు ఆ రెండు వందల కోట్ల ప్రస్తావన మళ్లీ వచ్చింది. ‘ఫ్యామిలీ స్టార్’ ప్రీ రిలీజ్ వేడుకలో. ‘ఎప్పడో ఓసారి రూ.200 కోట్లు కొడతా’ అంటూ ఓ స్టేట్మెంట్ విసిరాడు. `ఎవరో కొడితే మనం కొట్టలేమా` అంటూ ఇంకాస్త కాన్ఫిడెన్స్‌గా మాట్లాడాడు.
తన తొలి సినిమా రోజుల్లో వందకోట్లు కొట్టడం ఓ కలలా ఉండేదని, నాలుగో సినిమాకే వంద కోట్లు వచ్చాయని, లైగర్ సమయంలో రూ.200 కోట్లు కొడతానని చెబితే.. అందరూ తలోరకంగా మాట్లాడారని, ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదని హిత బోధ చేశారని గుర్తు చేసుకొన్నాడు. అయితే రూ.200 కోట్లు కొడతా అని చెప్పడం తప్పు కాదని, చెప్పి కొట్టకపోవడమే తప్పని, తన కెరీర్లో ఎప్పటికైనా రూ.200 కోట్ల సినిమా ఇస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాపై విజయ్ చాలా హోప్స్ పెట్టుకొన్నాడు. సినిమాలో తన పాత్ర కోసం పరశురామ్ ని ఫాలో అయ్యానని, ఈ సినిమాకి ఎన్ని అవార్డులు వచ్చినా, అవన్నీ పరశురామ్ కాళ్ల కింద పెట్టేస్తానని విజయ్ దర్శకుడిపై తన అభిమానాన్ని చాటుకొన్నాడు.