ప్రపంచంలో నెంబర్: 1 టెన్నిస్ క్రీడాకారిణిగా పేరొందిన మారియ షరపోవ డోపింగ్ పరీక్షలో నిషేధిత మేల్డోనియం అనే మందును వాడుతున్నట్లు కనుగొనడంతో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ టెన్నిస్ అసోసియేషన్ ప్రకటించింది. అంతేకాదు ఈ కారణంగా ఇటీవల జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ లో ఆమె గెలుచుకొన్న $ 298, 000 ని వెనక్కి తిరిగి ఇచ్చేయవలసి ఉంటుంది. ఆమెపై ఎన్నేళ్ళు సస్పెన్షన్ వేటు వేస్తారో ఇంకా తెలియవలసి ఉంది. ఒకవేళ నియమం ప్రకారం ఆమెపై కనీసం రెండేళ్ళ సస్పెన్షన్ విధించినట్లయితే 2016లో జరుగబోయే రియో ఒలింపిక్స్ లో పాల్గొనే అవకాశం కూడా కోల్పోవచ్చును.
ఆమె తన షుగర్ వ్యాధి నియంత్రణ కోసం నిషేధిత మెల్డోనియం అనే పదార్ధం కలిగిన ఒక మందును వాడుతున్నారు. ఆకారణంగా ఆమె డ్రాగ్ పరీక్షలు పట్టుబడి నిషేధానికి గురయ్యారు. ఆమె సస్పెన్షన్ కి గురయినట్లు తెలియగానే ఆమెతో తమ కంపెనీ కాంట్రాక్టుని రద్దు చేసుకొంటున్నట్లు ప్రపంచ ప్రసిద్ది చెందిన నైక్ సంస్థ అధికార ప్రతినిధి కేజువాన్ సిల్కిన్స్ ప్రకటించారు.
“ఆమె గురించి ఇటువంటి వార్తని వినవలసి వస్తుందని మేము ఎన్నడూ అనుకోలేదు. అది మాకు చాలా బాధని, దిగ్బ్రాంతిని కలిగించింది. ఈ పరిస్థితులలో మా సంస్థ ఆమెతో మా అనుబంధాన్ని కొనసాగించలేదు కనుక మా కాంట్రాక్టును రద్దు చేసుకొంటున్నాము. పరిస్థితులను బట్టి మున్ముందు తగిన నిర్ణయం తీసుకొంటాము,” అని మీడియాకి తెలిపారు.