ఏపీలో ఉన్న వీఐపీ నియోజకవర్గాల్లో గాజువాక కూడా ఒకటి. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అక్కడ పోటీ చేశారు. ముక్కోణపు పోటీలో వైసీపీ లబ్ది పొంది విజయం సాధించింది. ఉక్కు పరిశ్రమ ఉన్న ప్రాంతం… దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఓటర్లుగా ఉన్న నియోజకవర్గం… స్టీల్ ప్లాంట్‌తో పాటు, ఆటోనగర్ ఇండస్ట్రియల్ కారిడార్‌తో గాజువాక పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అంతేకాదు జాతీయ రహదారి పొడవునా విస్తరించిన ఈ నియోజకవర్గం ఆర్థికంగా రాష్ట్రానికి గుండె లాంటి ప్రాంతం.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతోపాటు, ఆటోనగర్ పరిశ్రమల్లో పని చేసే కార్మికులు ఓట్లు ఎక్కువగా ఉండే గాజువాక నియోజకవర్గంలో టీడీపీ తరపున పల్లా శ్రీనివాస్, వైసీపీ తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ పడుతున్నారు.
2009లో ఏర్పడిన గాజువాక నియోజకవర్గంలో జీవీఎంసీ పరిధిలోని 19 వార్డులు ఉన్నాయి. ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీ అభ్యర్థి గెలిచారు. వరుసగా ఒకే పార్టీ అభ్యర్థి గెలవడం గాని, లేదా ఒకేపార్టీ రెండు ఎన్నికల్లో గెలవడం గాని ఇప్పటివరకు జరగలేదు. యాదవ, కాపు సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రెండు వర్గాలకే ప్రధాన పార్టీలు టికెట్స్ ఇస్తుంటాయి. రెడ్డిక, గవర, వెలమ ఇతర బీసీ సామాజికవర్గాలకు దాదాపు 20 వేల చొప్పున ఓటింగ్ ఉంది. ఈ లెక్కల ఆధారంగానే గత 3 దఫాలుగా ఇక్కడ అభ్యర్థులకు ప్రాధాన్యం లభించింది. 2009లో పీఆర్పీ నుంచి కాపు సామాజికవర్గానికి చెందిన చింతలపూడి వెంకటరామయ్య గెలిస్తే.. 2014లో టీడీపీ నుంచి యాదవ నేత పల్లా శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యారు. 2019లో త్రిముఖ పోటీలో వైసీపీ, జనసేన హోరాహోరీగా తలపడ్డాయి. జనసేనాని పవన్ పోటీ చేశారు. టీడీపీ, జనసేన మధ్య భారీగా ఓట్లు చీలిపోయి వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. రెండు పార్టీలకు కలిపి లక్షా ఇరవై వేల ఓట్లు రాగా.. వైసీపీ అభ్యర్థికి 75వేల ఓట్లు వచ్చాయి.
పల్లా శ్రీనివాసరావు గాజువాకలో బలమైన అభ్యర్థిగా నిలబడ్డారు. వైసీపీ నుంచి ఆయనకు మేయర్ ఆఫర్ వచ్చినా .. ఆస్తులపై దాడులు చేసినా పార్టీ మారలేదు. ఈ కారణంగా గత ఎన్నికల్లో పవన్ నిలబడిన సీటు అయినా సరే టీడీపీ తీసుకుంది. పల్లా శ్రీనివాస్‌కు చాన్సు ఇచ్చింది. జనసేనను కూడా ఆయన కలుపుకుని వెళ్తున్నారు. నిజానికి పల్లా శ్రీనివాస్ రాజకీయ జీవితం పీఆర్పీ నుంచే ప్రారంభమయింది. 2009లో ఆయన పీఆర్పీ ఎంపీ అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేశారు. ఈ కారణంగా ఆయనపై జనసేన క్యాడర్ లోనూ వ్యతిరేకత లేదు. చిన్న చిన్న సమస్యలు ఉన్న పరిష్కరించుకున్నారు.
వైసీపీ తరపున అభ్యర్థిగా అనేక సందేహాలు, వడపోతల తర్వాత మంత్రి గుడివాడ అమర్నాథ్కు సీటు ఇచ్చారు. గాజువాక ప్రాంతంలోనే నివాసం ఉండే గుడివాడ అమర్నాథ్ గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. రెండో విడతలో మంత్రిగా అవకాశం పొంది రెండేళ్లుగా అధికారం చెలాయిస్తున్నారు. అయితే ఆయనను అనకాపల్లి నుంచి బదిలీ చేశారు. ఎక్కడో చోట సీటు వస్తుందని ఆశ పెట్టుకున్నారు. చివరికి తాను తన మిత్రుడు అయిన వరికూటి చందును సమన్వయకర్తగా నియమింప చేసిన సీటులోనే పోటీ చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, మిత్రుడు వరికూటి చందు మద్దతు కోల్పోయారు. వారు గుడివాడ అమర్నాథ్కు ఇంత వరకూ బహిరంగంగా మద్దతు ప్రకటించలేదు.
గుడివాడ అమర్నాథ్ కాపు సామాజికవర్గానికి చెందిన నేత అయినా పవన్ కల్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు గీత దాటి ఉండటంతో ఆ వర్గంలో ఆయనపై సానుకూలత లేదు. దీన్ని గుర్తించే ఆయనకు వైసీపీ అధినాయకత్వం టిక్కెట్ నిరాకరించింది. కానీ అత్యంత విధేయుడికే హ్యాండిచ్చారన్న ప్రచారం జరుగుతుందన్న ఉద్దేశంలో గాజువాకలో సర్దుబాటు చేశారు. ఓ రకంగా ఇప్పుడు ఆయన ఏటికి ఎదురీదుతున్నారు. టీడీపీ, జనసేన కలిసిపోవడం ఆ కూటమికి అడ్వాంటేజ్‌గా కనిపిస్తోంది.